Share News

Water Resources Dept: హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు ఆగవు

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:37 AM

హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాల ప్రవాహ వేగం తగ్గింది. జలాలు నిలిచిపోతాయి... అంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మకండి అని జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు

Water Resources Dept: హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు ఆగవు

  • అసత్య ప్రచారాలను నమ్మకండి: జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాల ప్రవాహ వేగం తగ్గింది. జలాలు నిలిచిపోతాయి... అంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మకండి’ అని జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన చేశారు. ‘పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలలోని 110 చెరువులను నింపేందు కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కుప్పం ఉపకాలువ చివర ఉన్న పరమసముద్రం చెరువుకు గత నెల 28న నీటిని వదిలాం. ఆ చెరువును గరిష్ఠస్థాయిలో నింపుతున్నాం. సోమవారం కుప్పం ఉపకాలువలో ఆదినేపల్లి దగ్గర నిర్మించిన పంపు స్టేషన్‌ ప్యానల్‌ బోర్డులో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో కొన్ని గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచింది. దీంతో కుప్పం ఉప కాలువలో ప్రవహిస్తోన్న నీటిని పంపు స్టేషన్‌పై భాగంలో 15 చెరువులకు, తూముల ద్వారా మళ్లించాం. కొన్ని గంటల వ్యవధిలోనే ప్యానెల్‌ బోర్డు సాంకేతిక సమస్యను పరిష్కరించాం. నీటి ఎత్తిపోతలను పునరుద్ధరించాం. తద్వారా ప్రవాహం వేగం పెరిగి కృష్ణా జలాలు పరమసముద్రం దిశగా పరుగులు తీస్తున్నాయి. ఈ ఉపకాలువ ద్వారా 110 చెరువులు నింపాక నియోజకవర్గంలోని ఇతర చెరువులను కూడా నింపుతాం’ అని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహమూర్తి తెలిపారు.

Updated Date - Sep 03 , 2025 | 05:38 AM