CM Chandrababu: జీడిపల్లికి పది రోజుల్లో నీరు
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:23 AM
రాయలసీమకు జలాలు అందించాలనే లక్ష్యంతో జలవనరుల శాఖ ఏడాది కాలంగా చేస్తున్న నిర్విరామ కృషి ఫలిస్తోందని.. మరో పది రోజుల్లో(ఈనెల 15) హంద్రీనీవా నుంచి జీడిపల్లికి జలాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ నెలాఖరునాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా నీరు
కాంట్రాక్టర్లు లక్ష్యాలను చేరుకోవాల్సిందే
పోలవరం ఎడమ కాలువ పనులు ఈ నెలాఖరుకు పూర్తి కావాల్సిందే
ప్రతినీటి బొట్టూ సద్వినియోగం కావాలి
నీటి వనరులపై ఆడిట్ నిర్వహించండి
జలవనరులపై సమీక్షలో సీఎం
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు జలాలు అందించాలనే లక్ష్యంతో జలవనరుల శాఖ ఏడాది కాలంగా చేస్తున్న నిర్విరామ కృషి ఫలిస్తోందని.. మరో పది రోజుల్లో(ఈనెల 15) హంద్రీనీవా నుంచి జీడిపల్లికి జలాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫేజ్-2 పూర్తి చేసి ఈ నెలాఖరునాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా నీరు తరలిస్తామని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలను కాంట్రాక్టర్లు పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. గాలేరు, నగరి ద్వారా కడపకు నీళ్లందించే పనులు ప్రారంభించాలని సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనులు ఈ నెలాఖరుకు పూర్తి కావాల్సిందేనని డెడ్‌లైన్ విధించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది నీటి ప్రవాహాలు ఆశాజనకంగా ఉన్నాయని, ప్రతినీటి బొట్టూ సద్వినియోగం కావాలని సూచించారు. నీటి ఆడిట్ జరగాల్సిందేనని జల వనరుల శాఖకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం జలవనరుల శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఫలిస్తున్న ప్రయత్నాలు!
కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రం లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సా గు, తాగు నీటిని అందించే భగీరథ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు హంద్రీనీవాకు రూ.3,890 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా హంద్రీనీవా పనుల పురోగతిని సీఎం తెలుసుకున్నారు. లక్ష్యం మేరకు హంద్రీనీవా తొలి దశ పనులు పూర్తి చేసి ఈ నెల 15 నుంచి ప్రధాన కాలువ ద్వారా జీడిపల్లికి నీరందిస్తామని అధికారులు తెలిపారు. జీడిపల్లి నుంచి గొల్లపల్లి, మరాల, చెర్లోపల్లి రిజర్వాయర్లకు జలాలను తరలిస్తామన్నారు. నెల 15న జీడిపల్లికి జలాలు విడుదల చేసి అక్కడ నుంచి 15 రోజుల పాటు పెన్నా-అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు నీటిని తరలిస్తామని అధికారులు చెప్పారు.