Water Resources Department: నారావారిపల్లెకు కృష్ణా జలాలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:20 AM
తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని మూలచెరువు ద్వారా 1,154 ఎకరాలకు సాగునీరు అందించేందుకు జల వనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
హంద్రీ-నీవా కాలువ ద్వారా మూలచెరువుకు తరలింపు
కల్యాణి డ్యాం నుంచి 4 గొలుసుకట్టు చెరువులకూ
రూ.126 కోట్ల మంజూరుకు ఉత్తర్వులు
జలవనరుల శాఖలో 7,197 నిర్వహణ పనులకు 344 కోట్లు
పోలవరం ఎడమ ప్రధాన కాలువలో 54వ ప్యాకేజీ
పనులకు రూ.13.25 కోట్లు
అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని మూలచెరువు ద్వారా 1,154 ఎకరాలకు సాగునీరు అందించేందుకు జల వనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. హంద్రీ-నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా కల్యాణి డ్యాంలోకి కృష్ణా జలాలను తరలించి.. అక్కడి నుంచి మూలపల్లి చెరువుకు పంపుతారు. ఈ ప్రక్రియలో భాగంగా నాలుగు గొలుసుకట్టు చెరువులనూ నింపుతారు. వాటికి నీరు తరలించేటప్పుడే.. సమీప గ్రామాల ప్రజలకు తాగునీరు అందిస్తారు. ఈ ప్రక్రియ కోసం రూ.126.06 కోట్లు మంజూరు చేస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ శాఖలో 7,197 యాజమాన్య నిర్వహణ పనులు చేపట్టేందుకు రూ.344.40 కోట్లు కేటాయించారు. కాగా.. పోలవరం ఎడమ ప్రధాన కాలువలో 54వ ప్యాకేజీ పనులు చేపట్టేందుకు రూ.13.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది.