Krishna Water Dispute: చేయాల్సిన అన్యాయమంతా చేసి..
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:50 AM
కృష్ణా జలాల చరిత్రపై ఎలాంటి అవగాహనా లేకుండా, తన హయాంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి చేయాల్సిన అన్యాయమంతా చేసిన జగన్..
రాజకీయ లబ్ధి కోసమే బాబుపై జగన్ నిందలు
ఆల్మట్టి ఎత్తును నాడు చంద్రబాబు అడ్డుకున్నా మాజీ సీఎం దాచిపెట్టారు
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా కిమ్మనలేదు
సాగునీటి నిపుణుల ధ్వజం
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల చరిత్రపై ఎలాంటి అవగాహనా లేకుండా, తన హయాంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి చేయాల్సిన అన్యాయమంతా చేసిన జగన్.. ఇప్పుడు కృష్ణా ట్రైబ్యునల్‌లో సరైన వాదనలు వినిపించడం లేదని సీఎం చంద్రబాబుపై నిందలేయడంపై సాగునీటి రంగ నిపుణులు మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసమే లేఖ రాశారని ధ్వజమెత్తారు. 1996లో ఆల్మట్టి ఎత్తును పెంచేందుకు కర్ణాటక ప్రయత్నాలు చేయడంపై నాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ఈ అంశంపై జోక్యం చేసుకుని పెంపును అడ్డుకోవాలని కోరుతూ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దరిమిలా దీనిపై అధ్యయనానికి 1996 ఆగస్టు 11న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బిహార్, అసోం సీఎంలతో దేవెగౌడ కమిటీని వేశారు. ఆ మర్నాడే కమిటీ సమావేశమై ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్లతో సాంకేతిక కమిటీని నియమించింది. ఈ కమిటీ 1997 జనవరిలో ఆల్మట్టి ఎత్తు 519.6 మీటర్లు చాలని, పెంచాల్సిన అవసరం లేదంటూ సీఎంల కమిటీకి నివేదిక అందజేసింది. ఈ కమిటీ సిఫారసు మేరకే ఆల్మట్టి ఎత్తు పెంచే ప్రతిపాదన నిలిచిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు తీసుకున్న చొరవను దాచిపెట్టి.. ఎత్తు పెంచుతున్నా పట్టించుకోలేదంటూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టించేలా జగన్ అబద్ధమాడారు’ అని విమర్శించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే 2021లో కృష్ణా జలాల పంపకం బాధ్యతను ట్రైబ్యునల్-2కి అప్పగిస్తూ కేంద్రం విధివిధానాలను ప్రకటించిందని.. ఆ ఏడాది అక్టోబరు 6న ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు.. విధివిధానాల ప్రకటనపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు.
అలాగే అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన నాటి జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాకుండా అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టులు చేపట్టినా కిమ్మనలేదని గుర్తుచేశారు. అన్నిటికీ మించి.. 2023లో తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టి కేసీఆర్‌కు లబ్ధి చేకూర్చేందుకు.. నాగార్జున సాగర్ డ్యాంపైకి ఏపీ పోలీసు బలగాలను పంపారని తెలిపారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి.. ట్రైబ్యునల్‌లో వాదనలెలా ఉండాలో సలహాలివ్వకుండా.. రెచ్చగొట్టే ధోరణిలో సీఎంకు లేఖ రాయడం ఏమిటని నిపుణులు విమర్శించారు.
మన వాటా ఒక్క టీఎంసీ తగ్గినా..చంద్రబాబుదే బాధ్యత
ముఖ్యమంత్రికి జగన్ లేఖ
కృష్ణా జలాల్లో రాష్ట్రవాటా 512 టీఎంసీల్లో ఒక్క టీఎంసీ తగ్గినా అందుకు టీడీపీ, సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని వైసీసీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. నీటి పంపకంపై కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 విచారణ నేపథ్యంలో శుక్రవారం ఆయన చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. ట్రైబ్యునల్‌లో రాష్ట్రం తరఫున సమర్థ వాదనలు వినిపించడం లేదని ఆరోపించారు. దీనివల్ల కృష్ణాజలాల్లో రాష్ట్రానికి తీరని అన్యా యం జరుగుతోందన్నారు. మరోవైపు కర్ణాటక ఆల్మట్టి డ్యాంను 524.25 మీట ర్లకు పెంచుతోందని.. దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడినందునే.. కృష్ణా బోర్డు, దాని పరిధి విధివిధానాలపై 2023 జూలై 15న కేంద్రం గెజిట్ జారీ చేసిందన్నారు.