Rain Impact: కృష్ణా, తుంగభద్ర పరవళ్లు
ABN , Publish Date - Jul 06 , 2025 | 02:46 AM
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి...
శ్రీశైలం డ్యాంకుపోటెత్తుతున్న వరద
జూరాల, సుంకేసుల నుంచి దిగువకు భారీగా నీటి ప్రవాహం... శ్రీశైలం డ్యాంకుపోటెత్తుతున్న వరద
జలాశయంలో 175.10 టీఎంసీలు నిల్వ
తుంగభద్రకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
పొంగుతున్న గోదావరి, పెరుగుతున్న నీటిమట్టం
కర్నూలు/పోలవరం/విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి 1,21,471 క్యూసెక్కులు, కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజీ నుంచి 66,589 క్యూసెక్కులు శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు ఆదివారం సాయంత్రానికి డ్యాంకు చేరుతుందని ఇంజనీర్లు తెలిపారు. డ్యాం సైట్‌లో 1,30,780 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 877.40 అడుగుల స్థాయిలో 175.10 టీఎంసీలు డ్యాంలో నిల్వ చేసి, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ద్వారా 67,019 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే మూడు నాలుగు రోజుల్లో క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని కడప ఇరిగేషన్ ప్రాజెక్ట్సు సీఈ, శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌చార్జి ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. కాగా 10వ గేటు దిగువన రబ్బర్ సీల్ నుంచి స్వల్ప లీకేజీ వస్తుండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తుంగభద్రకు రికార్డు వరద
గత పదేళ్ల రికార్డును అధిగమించి తుంగభద్రకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం 72,931 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. మరమ్మతుల దృష్ట్యా 80 టీఎంసీలే నిల్వ చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో 76.519 టీఎంసీలు నిల్వచేసి, 22 గేట్లెత్తి 64,702 క్యూసెక్కుకులు దిగువకు వదిలేస్తున్నారు. సుంకేసుల వద్ద సాయంత్రం 6 గంటలకు66,589 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. నీరు పుష్కలంగా వస్తున్నందున తక్షణమే కాలువకు సాగునీరు విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు.

భద్రాచలం వద్ద 20 అడుగులకు నీటిమట్టం
ఉపనదుల నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. శనివారం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 20.3 అడుగులకు చేరుకుంది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలో నుంచి 1,87,051 క్యూసెక్కుల అదనపు జలాలను దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. కాఫర్ డ్యాంకి ఎగువన నీటిమట్టం పెరగడంతో అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా గొందూరు గండి పోశమ్మ ఆలయంలోకి వరద చేరింది. దీంతో అధికారులు ఆలయానికి రాకపోకలు నిలిపివేశారు.