Share News

Krishna Water Dispute: నీటి కేటాయింపులెప్పుడు?

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:18 AM

ఈ నీటి సంవత్సరంలో కృష్ణా జలాల పంపిణీపై అధికారిక నిర్ణయం తీసుకోకుండా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అలసత్వం ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Krishna Water Dispute: నీటి కేటాయింపులెప్పుడు?

  • కృష్ణా బోర్డు తీరుతో ఉభయ రాష్ట్రాల నడుమ చిచ్చు

అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఈ నీటి సంవత్సరంలో కృష్ణా జలాల పంపిణీపై అధికారిక నిర్ణయం తీసుకోకుండా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అలసత్వం ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపుగా రెండు నెలలుగా బోర్డు సమావేశమే కాలేదు. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ అతుల్‌ జైన్‌ కేంద్ర జల సంఘం చైర్మన్‌గా నియమితులయ్యారు. బోర్డు బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. కేఆర్‌ఎంబీకి శాశ్వత చైర్మన్‌ను ఇంకా నియమించలేదు. దీంతో నిర్ణయాలు దాదాపు నిలిచిపోయాయి. ఈ ఏడాది జూన్‌ 1నుంచి 2025-26 కొత్త నీటి సంవత్సరం మొదలైంది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకూ కేటాయించాల్సి ఉంది. రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి దాకా నీటి కేటాయింపులపై బోర్డు సమావేశాన్నే ఏర్పాటు చేయలేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీవర్షాలతో వరద తరలివస్తోంది. శ్రీశైలం డ్యాం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రెండు రాష్ట్రాలూ జోరుగా విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు శ్రీశైలం గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు. సాగర్‌ నుంచి కూడా దిగువకు నీటిని వదులుతున్నారు. వీటిని వినియోగించడానికి రాష్ట్రం సిద్ధం కావడంతో.. ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ విమర్శలు ప్రారంభించింది. ఏపీ మాత్రం సంయమనం పాటిస్తోంది. జూన్‌ మూడోవారంలో నీటి కేటాయింపులపై రెండు రాష్ట్రాలతోనూ సమావేశం కావలసిన బోర్డు.. ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 26 , 2025 | 05:19 AM