Krishna River Floods: కృష్ణమ్మకు వరద పోటు
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:05 AM
ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పోటెత్తుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ప్రకాశం బ్యారేజీకి 6.57 లక్షల క్యూసెక్కులు
బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అమరావతి/విజయవాడ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పోటెత్తుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగడంతో బ్యారేజీకి 6,57,473 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజీ గేట్లను పూర్తిస్థాయిలోకి ఎత్తి 5,66,860 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం ఇదే మొదటిసారి. దీంతో నది ఒడ్డున స్నానాలను అధికారులు నిషేధించారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు జల్లు స్నానాలు మాత్రమే ఆచరించాలని సూచించారు. కాగా, ఆదివారం నాటికి 1,080 టీఎంసీల కృష్ణా జలాలు కడలి పాలయ్యాయి. సోమవారం మరో 20 టీఎంసీలు కలిపి మొత్తం 1,100 టీఎంసీల వరకూ సముద్రంలో కలిసే అవకాశం ఉందని జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
అప్రమత్తంగా ఉండండి: అధికారులతో అత్యవసర భేటీలో సీఎం
కృష్ణా, గోదావరి నదుల్లోకి వస్తున్న భారీ వరదపై అప్రమత్తతో వ్యవహరించాలని జల వనరులు, విద్యుత్తు, విపత్తుల నిర్వహణ శాఖలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆదివారం ఆయా శాఖ అధికారులతో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద ఉధ్రుతిపై నిరంతరం పరిశీలన చేస్తూ తగు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేశారు. వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా నీటిని మళ్లించి చెరువులన్నింటినీ నింపేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని రియల్‌టైమ్‌లో అంచనా వేయాలని తెలిపారు. వరద నీటి యాజమాన్య విధానాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. సాధ్యమైనన్ని ఎక్కువ చెరువులను నింపాలన్నారు. కృష్ణాతో పాటు గోదావరి నదిలోనూ 10.12 లక్షల క్యూసెక్కుల వరద ఉందని, సోమవారం నాటికి ఇది 11.50 లక్షల క్యూసెక్కులకు పెరగవచ్చని సీఎంకు అధికారులు వివరించారు. గతేడాది కంటే భూగర్భ జలమట్టం 2.07 మీటర్ల మేర పెరిగిందని తెలిపారు. వరదలపై అప్రమత్తంగా ఉంటూ ఆస్తి, ప్రాణనష్టం లేకుండా కార్యాచరణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించాలన్నారు. ప్రజలకు అత్యవసర సాయం అందించాలని, తాగునీటికి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పెరిగిన గోదావరి నీటిమట్టం
పోలవరం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న అదనపు జలాలను స్పిల్‌వే 48గేట్ల నుంచి అధికారులు దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ఎగువన 32.600 మీటర్లు, దిగువన 24.060 మీటర్లు నీటిమట్టం నమోదైనట్టు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు.