కృష్ణ కృష్ణా!
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:11 AM
కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణంలో నడుస్తున్న బీ-ఫార్మసీ కళాశాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. రాష్ట్రంలోని 91 ఫార్మసీ కళాశాలలకు 2025-26 విద్యా సంవత్సరంలో అనుమతి పొడిగిస్తూ ఈ నెల 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జాబితాలో కృష్ణాయూనివర్సిటీలో నడుస్తున్న బీ-ఫార్మసీ కళాశాల పేరు లేదు. దీంతో గత ఐదు సంవత్సరాలుగా నడుస్తున్న బీ-ఫార్మసీ కళాశాల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది అడ్మిషన్లపై అయోమయం నెలకొంది.
- కృష్ణా యూవర్సిటీలోని బీ-ఫార్మసీ కళాశాలకు లభించని గుర్తింపు
- తాజాగా రాష్ట్రంలోని 91 ఫార్మసీ కళాశాలలకు గుర్తింపును పొడిగిస్తూ ఉత్తర్వులు
- ఆ జాబితాలో దక్కని స్థానం.. ఈ ఏడాది అడ్మిషన్లపై అయోమయం!
- గతంలో ఫార్మసీ విభాగంలోని పీజీ కోర్సు రద్దు
- అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణంలో నడుస్తున్న బీ-ఫార్మసీ కళాశాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. రాష్ట్రంలోని 91 ఫార్మసీ కళాశాలలకు 2025-26 విద్యా సంవత్సరంలో అనుమతి పొడిగిస్తూ ఈ నెల 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జాబితాలో కృష్ణాయూనివర్సిటీలో నడుస్తున్న బీ-ఫార్మసీ కళాశాల పేరు లేదు. దీంతో గత ఐదు సంవత్సరాలుగా నడుస్తున్న బీ-ఫార్మసీ కళాశాల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది అడ్మిషన్లపై అయోమయం నెలకొంది.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం:
కృష్ణా యూనివర్సిటీలో 2020లో బీ-ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. ఒక ఏడాది 100 సీట్లు, అనంతరం 60 సీట్ల చొప్పున బీ-ఫార్మసీ కోర్సులో చేరేందుకు అనుమతులు కూడా ఇచ్చారు. ఇప్పటికే రెండు బ్యాచ్‌లు కోర్సును పూర్తి చేసుకుని వెళ్లిపోయాయి. ఈ నెల 12వ తేదీన ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని ఫార్మసీ కళాశాలలకు 2025-26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌ల కోసం అనుమతులు ఇస్తూ జీవోఆర్‌టీ నెంబరు 144ను జారీ చేసింది. ఆయా కళాశాలల్లో ఎన్ని సీట్లు భర్తీ చేయాలనే అంశంపై స్పష్టత ఇచ్చింది. కానీ కృష్ణాయూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న బీ-ఫార్మసీ కళాశాల పేరు ఈ జాబితాలో లేదు. దీంతో ఈ ఏడాది ఫార్మసీ కోర్సులో అడ్మిషన్‌లు ఉంటాయా.. ఉంటే సంబంధిత కోర్సు చదివిన విద్యార్థినీ, విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు పైకోర్సులు చదివేందుకు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే అంశంపై అయోమయం నెలకొంది. 2020 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా కృష్ణాయూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులలో సీట్లను భర్తీ చేస్తూ వస్తున్నారు.
జిల్లాలో రెండు కళాశాలలకు అనుమతి
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో విజయవాడలోని కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యుటికల్స్‌లో బీ-ఫార్మసీ కోర్సులో 100 సీట్లు, ఫార్మా-డి కోర్సులో 30 సీట్లు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నూజివీడులోని శ్రీసిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో బీ-ఫార్మసీ కోర్సులో 100 సీట్లు భర్తీ చేసేందుకు అనుమతులు వచ్చాయి. కానీ కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణంలోని బీ-ఫార్మసీ కళాశాలకు అనుమతులు ఇవ్వక పోవడం గమనార్హం. కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మసీ కళాశాలలకు అనుమతులు ఇవ్వగా, కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఫార్మసీ కళాశాలకు అనుమతులు ఇవ్వకపోవడం, ఎన్ని సీట్లలో ఈ ఏడాది ఈ కోర్సులో విద్యార్థులను చేర్చుకోవాలో ఉత్తర్వులలో పేర్కొనక పోవడం విశేషం. ఈ అంశంపై యూనివర్సిటీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. గతంలో కృష్ణాయూనివ ర్సిటీలో ఫార్మసీ విభాగంలో పీజీ కోర్సు ఉండేది. ఈ కోర్సును వివిధ కారణాలతో రద్దు చేశారు. పీజీ కోర్సు మాదిరిగానే బీ-ఫార్మసీ డిగ్రీ కోర్సును కూడా వదిలేస్తారా లేక యూనివర్సిటీ అధికారులు అనుమతులు తీసుకువస్తారా అనే అంశంపైన చర్చ జరుగుతోంది.
సరైన అధ్యాపకులు లేకపోవడం వల్లేనా!
వర్సిటీలో బీ-ఫార్మసీ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. అన్ని సీట్లు భర్తీ అవుతున్నాయి. కానీ ఈ కళాశాలలో సరైన విద్యార్హతలు ఉన్న అధ్యాపకులను నియమించకపోవడం వల్లే ప్రభుత్వం ఈ ఏడాది అనుమతులు ఇవ్వలేదనే వాదన వినపడుతోంది. వర్సిటీలోని బీ-ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ పోస్టును గతంలో పని చేసిన వీసీ ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి నియమించారని స్థానిక అధ్యాపకులు చెబుతున్నారు. సదరు ప్రిన్సిపాల్ విద్యార్హతలను పరిశీలించకుండా నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్హతలు లేని వ్యక్తిని ప్రిన్సిపాల్ పోస్టులో నుంచి తొలగించేందుకు వర్సిటీ అధికారులు గతంలో ప్రయత్నాలు చేశారు. దీంతో సదరు ప్రిన్సిపాల్ కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై వర్సిటీ అధికారులు మూడు విడతలుగా హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. బీ-ఫార్మసీ కళాశాలలో సరైన అధ్యాపకులను నియమించే విషయంలో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, కోర్టు కేసుల వల్లే ఈ ఏడాది అనుమతులు రాలేదని ఇక్కడ పనిచేసే అఽధ్యాపకులు చెప్పుకుంటున్నారు.