Share News

Police Action: అధిక వడ్డీకి అప్పులు.. చెల్లించకుంటే దాడులు

ABN , Publish Date - Dec 24 , 2025 | 05:04 AM

అధిక వడ్డీలకు అప్పులు ఇస్తాడు. చెల్లించని వారిపైకి అనుచరులను ఉసిగొలుపుతాడు. యువతకు గంజాయి సరఫరా చేస్తాడు.

Police Action: అధిక వడ్డీకి అప్పులు.. చెల్లించకుంటే దాడులు

  • గంజాయి అమ్మకం, సుపారీ తీసుకుని బెదిరింపులు

  • కృష్ణా జిల్లాలో రౌడీషీటర్‌ అరెస్టు.. రోడ్డుపై నడిపించిన పోలీసులు

విజయవాడ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీలకు అప్పులు ఇస్తాడు. చెల్లించని వారిపైకి అనుచరులను ఉసిగొలుపుతాడు. యువతకు గంజాయి సరఫరా చేస్తాడు. సుపారీ తీసుకుని బెదిరింపులకు పాల్పడుతుంటాడు. ఇలా కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ గ్యాంగ్‌ను నిర్వహిస్తున్న రౌడీషీటర్‌ కోసూరి మణికంఠ అలియాస్‌ కేటీఎం పండుకు పోలీసులు కొత్త ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. పండుతోపాటు అతని అనుచరుడిని రోడ్డుపై నడిపించారు. మాదిరెడ్డి శివకుమార్‌ అనే యువకుడికి పండు గతంలో ఆటోను అద్దెకిచ్చాడు. ఎక్కువ అద్దెను వసూలు చేస్తుండడంతో శివకుమార్‌ దాన్ని వెనక్కి ఇచ్చేశాడు. అయితే అద్దె డబ్బులు రూ.5వేలు బాకీ ఉండగా.. దానికి వడ్డీ వేసి విడతల వారీగా రూ.70 వేలు వసూలు చేశాడు. ఈ నెల 21న పండు తన అనుచరుడైన కళింగపట్నం మనోహర్‌ అలియాస్‌ బబ్లూని డబ్బులకోసం శివకుమార్‌ ఇంటికి పంపాడు. మనోహర్‌.. కరీం, వినోద్‌, ముక్కలు అలియాస్‌ దుర్గాప్రసాద్‌, గిరీ్‌షతో కలిసి వెళ్లి శివకుమార్‌పై ఇనుప రాడ్లతో దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం పండును అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో పోరంకి నుంచి వారిని నడిరోడ్డుపై నడిపించారు.

Updated Date - Dec 24 , 2025 | 05:04 AM