Share News

Krishna Water Dispute: రాయలసీమ వరకూ కృష్ణా పరీవాహకమే

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:53 AM

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం.. దాని ఆవలి ప్రాంతమంటూ తెలంగాణ చేస్తున్న వాదన అర్థరహితమేనని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది.

Krishna Water Dispute: రాయలసీమ వరకూ కృష్ణా పరీవాహకమే

  • విభజన చట్టమే స్పష్టంచేసింది.. కృష్ణా బేసిన్‌పై తెలంగాణ వాదన అర్థరహితం

  • గోదావరి, కావేరి, కృష్ణా, పెన్నా నీటిపై ట్రైబ్యునళ్లు ఇచ్చిన ఆదేశాలున్నాయ్‌

  • వాటి ప్రకారమే చట్టబద్ధంగా ఆంధ్రకు నీటి కేటాయింపులు

  • రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా పరిగణించాలి.. కృష్ణా ట్రైబ్యునల్‌-1 ఇదే స్పష్టం చేసింది

  • బేసిన్‌ ఆవలికి నీటిని తరలించుకోవచ్చు.. అలా మళ్లించుకునే హక్కూ మాకుంది

  • బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట సీనియర్‌ న్యాయవాది గుప్తా వాదనలు

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం.. దాని ఆవలి ప్రాంతమంటూ తెలంగాణ చేస్తున్న వాదన అర్థరహితమేనని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది. కృష్ణా బేసిన్‌ రాయలసీమ ప్రాంతం వరకు ఉందని రాష్ట్ర విభజన చట్టం స్పష్టంచేసిందని గుర్తుచేసింది. కృష్ణా జలాల పునఃపంపిణీపై జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్తా, జి.ఉమాపతి, న్యాయవాదులు ఎస్‌.సంజయ్‌, జె.శరత్‌చంద్ర గురువారం కూడా తమ వాదనలు కొనసాగించారు. బేసిన్‌ ఆవలిప్రాంతం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ వైఖరిని వారు తేల్చిచెప్పారు. పరీవాహక ప్రాంతం ఆవల ప్రవహించే జలాలను సమానంగా పంచుకోవాలన్న తెలంగాణ వాదన అర్థరహితమన్నారు. ‘ఈ విషయంలో ఇప్పటికే గోదావరి, కావేరి, కృష్ణా, పెన్నా నదీ జలాలకు సంబంధించి ట్రైబ్యునళ్ల ఆదేశాలు ఉన్నాయి. వాటిని అనుసరించే నీటి కేటాయింపులూ జరిగాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ తరలిస్తున్న నీటికి చట్టబద్ధమైన కేటాయింపులు ఉన్నాయి. ఈ దిశగా కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-1 ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ట్రైబ్యునల్‌-1(బచావత్‌), ట్రైబ్యునల్‌-2(బ్రిజేశ్‌కుమార్‌) కూడా నదీ జలాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చాయి’ అని ఏపీ స్పష్టంచేసింది. ఈ మేరకు రికార్డులను కూడా చూపించింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేలా నదీ జలాలను వినియోగించుకోవచ్చని తెలిపింది. పరీవాహకం ఆవలి ప్రాంతానికి నీటిని తరలించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని రెండు కృష్ణా ట్రైబ్యునళ్లూ పేర్కొన్నాయని.. ప్రాజెక్టుల్లోని నీటిని మళ్లించుకునే హక్కు కూడా ఉందని స్పష్టం చేశాయని వెల్లడించింది. రాష్ట్రమంతా ఒకటే సమగ్ర యూనిట్‌గా ఉంటుందంటూ బ్రిజేశ్‌కుమార్‌ ట్రెబ్యునల్‌ ఎదుట కొన్ని పూర్వ మార్గదర్శకాలను ఉంచింది.


రాష్ట్రం యావత్తునూ ఒకే యూనిట్‌గా పరిగణించాలని కృష్ణా ట్రైబ్యునల్‌-1 స్పష్టం చేసిందని.. పరీవాహక ప్రాంతం ఆవల నీటిని వాడుకునే విషయంలో మహారాష్ట్రను నియంత్రించిన ఇదే ట్రైబ్యునల్‌.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని గుర్తుచేసింది. అవుట్‌సైడ్‌ బేసిన్‌కు నదీ జలాలు మళ్లించడం న్యాయసమ్మతమని, అనుమతించదగినదేనని కూడా తేల్చిచెప్పిందని జైదీప్‌ గుప్తా తెలిపారు. మహారాష్ట్రలో కృష్ణా పరీవాహక ప్రాంతం ఆవల ఉన్న కోయినా డ్యాంకు ట్రైబ్యునల్‌-1.. 25 టీఎంసీలు కేటాయించిందని.. దీనికి చట్టబద్ధత ఉందని వివరించారు. పెన్నా బేసిన్‌ తీవ్ర దుర్భిక్ష ప్రాంతంలో ఉన్నందున కృష్ణా జలాలను అటు మళ్లించేందుకు రాష్ట్ర విభజన చట్టం (2014) కూడా ఆమోదించిందన్నారు. ‘తెలంగాణకు కృష్ణా జలాలను మళ్లించాలంటే అది ఎగువ ప్రాంతమైనందున ఎత్తిపోతలను నిర్మించి పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు గ్రావిటీ ద్వారా నీళ్లను పారించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇరిగేషన్‌ ఇన్‌ఫ్రా అవసరం లేదు. గోదావరిలో మిగులు జలాలను రాయలసీమకు గ్రావిటీ ద్వారానే తరలించాలని భావిస్తున్నాం. నీటిని బేసిన్‌కే పరిమితం చేయడం సరికాదని జాతీయ నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌ కూడా స్పష్టం చేసింది. సహజసిద్ధ ప్రకృతి ధర్మాన్ని అనుసరించే కృష్ణా ట్రైబ్యునళ్లు రెండూ అవుట్‌సైడ్‌ బేసిన్‌పై ఆదేశాలిచ్చాయి. ఈ నేపథ్యంలో బేసిన్‌కు ఆవల నీటి వినియోగానికి అడ్డుపడేలా తెలంగాణ చేస్తున్న వాదనంతా అర్థరహితమేనని తేలిపోతోంది’ అని గుప్తా తెలిపారు. అనంతరం ట్రైబ్యునల్‌ విచారణను జనవరికి వాయిదావేసింది. ఆ నెల 21, 22, 23 తేదీల్లో తదుపరి విచారణ జరుగుతుంది.

Updated Date - Dec 19 , 2025 | 03:54 AM