Flood Levels: మళ్లీ కృష్ణా, గోదావరి ఉగ్రరూపం
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:30 AM
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి పెరిగింది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 6,39,737 క్యూసెక్కుల వరద వస్తోంది
ప్రకాశం బ్యారేజీకి నేడు 7లక్షల క్యూసెక్కుల వరద?
భద్రాచలంలో మొదటి హెచ్చరిక దాటి ప్రవాహం
రాజమహేంద్రవరం/పోలవరం, విజయవాడ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి పెరిగింది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 6,39,737 క్యూసెక్కుల వరద వస్తోంది. 69 గేట్లను పూర్తిస్థాయిలోకి ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా సముద్రలోకి వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయానికి ప్రవాహం 7లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి హెచ్చరిక దాటి 45 అడుగులకు చేరింది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.70 అడుగులకు చేరింది. 11.75 అడుగులకు చేరితే మొదటి హెచ్చరిక జారీ అవుతుంది. ఈసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి 9,77,625 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకల్లోకి నీరు బాగా పెరుగుతోంది.