Share News

AP Rivers: కృష్ణమ్మ ఉరుకులు.. గోదారమ్మ పరుగులు

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:41 AM

రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది.

AP Rivers: కృష్ణమ్మ ఉరుకులు.. గోదారమ్మ పరుగులు

  • నేడు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద

  • శ్రీశైలం నుంచి 5.5లక్షల క్యూసెక్కులు రాక

  • గోదావరికీ మరింత వరద..

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల నుంచి 2,13,311 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 87,158 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 3750 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. దీంతో సోమవారం జలాశయం 10 క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటి మట్టం సోమవారం రాత్రి 9 గంటలకు 881.60 అడుగులు, నీటి లభ్యత..196.561 టీఎంసీలుగా నమోదైంది. నాగార్జున సాగర్‌ జలాశయానికి శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,31,699 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో 26 క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 585.80 అడుగులు ఉంది. 2,93,663 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జునసాగర్‌ నుంచి 2,26,389 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాగా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తనున్నదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ హెచ్చరించారు. శ్రీశైలం నుంచి మంగళవారం 5.5లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల కానున్నదని ఆయన సోమవారం రాత్రి తెలిపారు. మరోవైపు గోదావరిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది.

Updated Date - Aug 19 , 2025 | 05:42 AM