Alluri Seetharamaraju Districtt: కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు హత్య
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:25 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు సోమవారం హత్యకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట ఎస్‌ఐ రామకృష్ణారావు, స్థానికులు అందించిన వివరాలు..
భూ వివాదమే కారణం
రోలుగుంట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు సోమవారం హత్యకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట ఎస్‌ఐ రామకృష్ణారావు, స్థానికులు అందించిన వివరాలు.. మండలంలోని ఎంకే పట్నం పంచాయతీ శివారు ఛటర్జీపురం సర్వే నంబర్ 139లో 10.83 ఎకరాల భూమికి సంబంధించిన పట్టా నూకరాజు పేరిట ఉంది. అందులో కొంత భూమిని గత 30 ఏళ్ల నుంచి ఛటర్జీపురం గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. సదరు భూమిని ఖాళీ చేయాలని గిరిజనులపై నూకరాజు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. మార్చిలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోగా నూకరాజు గాయపడ్డారు. గొడవల నేపథ్యంలో ఇరువర్గాలు ఆ భూమి జోలికి వెళ్లకూడదని, గిరిజనులు వేసుకున్న పంటను అలాగే ఉంచాలని తహశీల్దార్ సమక్షంలో బైండోవర్ చేయించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నూకరాజు తన అనుచరులతో భూమి వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ గిరిజనులు ఉన్నారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. గిరిజనులు కర్రలు, కత్తులతో దాడి చేయడంతో నూకరాజుకు తలకు బలమై అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ రామకృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నూకరాజు కుమారుడు కన్నబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.