Kondapalli Region: కొండపల్లి సీమలోకాకతీయం
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:00 AM
కాకతీయుల మూలం ఎక్కడుంది? ఓరుగల్లు కేంద్రంగా తిరుగులేని పాలన సాగించిన రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర వంటి పరాక్రముల పూర్వీకుల అడుగు జాడలు ఎక్కడ మొదలయ్యాయి..
ఆ వంశ ఆద్యుడు గుండన జన్మస్థలం ‘కాకర్తి’
నందిగామ మండలం మాగల్లు సమీపంలోని గ్రామం
నేలకొండపల్లిలో దొరికిన రాగి శాసనాల్లో ఆధారాలు
నాడు ఇక్కడ సామంతులుగా ‘కాకతీయ గుండన’
ఆపై ప్రబల శక్తిగా మారిన కాకతీయ వంశీయులు
ఓరుగల్లు కేంద్రంగా ఘనమైన పాలన
(విజయవాడ-ఆంధ్రజ్యోతి): కాకతీయుల మూలం ఎక్కడుంది? ఓరుగల్లు కేంద్రంగా తిరుగులేని పాలన సాగించిన రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర వంటి పరాక్రముల పూర్వీకుల అడుగు జాడలు ఎక్కడ మొదలయ్యాయి? కాకతీయులకు ఆదిగా నిర్ధారించిన ‘కాకతీయ గుండన’ ఎక్కడివాడు? ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇటీవల లభించిన రాగి ఫలకాలపై లిఖించిన శాసనాలు, వాటిని పరిశోధించిన చరిత్రకారులు... దీనికి సమాధానం కనుగొన్నారు. విజయవాడ సమీపంలోని కొండపల్లి ప్రాంతంలోని ‘కాకర్తి’ అనే గ్రామంలోనే ‘కాకతీయ గుండన’ మూలాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇటీవల తెలంగాణలోని నేలకొండపల్లిలో బయటపడిన రాగిఫలకాల శాసనాలను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే... ‘కాకర్తి’ పేరుతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో గ్రామమేదీ లేదు. కాలక్రమంలో దాని పేరు మారి ఉండొచ్చు. లేదా... ఏదైనా కారణాలవల్ల ఆ గ్రామం కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చుననే అనుమానాలున్నాయి. ఇప్పుడు చరిత్రకారులు ‘కాకర్తి’ క్షేత్రస్థాయిలో గుర్తించడంపైనా దృష్టి సారించారు. ఒకప్పుడు ‘కొండపల్లి సీమ’లో భాగమైన నందిగామ మండలం మాగల్లు సమీపంలో కాకర్తి (కాకతిపురం, కాకర్త్యపురం) గ్రామం ఉండొచ్చనని పురావస్తు శాస్త్రవేత్త, స్థపతి ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

చారిత్రక ఆనవాళ్లు...
క్రీస్తు శకం 900కి ముందు కాకర్తి ఉండేదని తెలుస్తోంది. కాకతీయ వంశ ఆదిపురుషుడు గుండన కాకర్తిలో నివసించాడని, కాకతీయుల పూర్వీకులు సకలేశ్వర, బిజ్జేశ్వర, గుండేశ్వర వంటి దేవాలయాలను నిర్మించారని ఫలకాలు చెబుతున్నాయి. కొండపల్లి, సమీపంలోని బొజ్జప్రోలు ప్రాంతాలు కాకతీయ రాజవంశం జన్మభూమిగా రాగిఫలకాలు నిర్ధారిస్తున్నాయి. ఈ శాసనాల ప్రకారం కాకతీయుల వంశవృక్షం గుండ-1 (కాకతీయ గుండన), గుండ-2, గుండ-3, ఎర్రలతో మొదలైంది. తర్వాత ఎర్ర కుమారులు బేటియా, గుండయ్య, గోనకలు అధిపతులుగా ఉన్నారు. కొండపల్లి సీమను గుండన, బొజ్జప్రోలును బేటియా పర్యవేక్షించారని శాసనాలు చెబుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాకు సరిహద్దున ఉన్న నేలకొండపల్లిలో ముస్లిం శ్మశానవాటికలో వేంగి చాళుక్యులకు సంబంధించి 9 సెట్ల రాగి ఫలకాలు లభించాయి. రాగిఫలకాల సెట్లలో వేంగి చాళుక్యుల రాజవంశావళి వివరాలు, ఆలయ దానధర్మాలు ఉన్నాయి. భారత పురావస్తు సర్వే డైరెక్టర్ కె.మునిరత్నం వీటిని ముందుగా అధ్యయనం చేసి ప్రపంచానికి కాకతీయుల జన్మస్థలాన్ని పరిచయం చేశారు. రెండో సెట్ రాగి ఫలకాల్లో క్రీస్తుశకం 918లో చాళుక్య పాలకుడైన రెండో విక్రమాదిత్య పట్టాభిషేకం నేపథ్యంలో కాకతీయుల తొలి వంశావళి గురించి ప్రస్తావించారు. కాకతీయ గుండన కొండపల్లి సీమ వాసి అని ఈ శాసనాల్లో ఉంది. శతాబ్దాల కిందట కొండపల్లి సీమలో వేసిన పునాదులపైనే కాకతీయ ప్రాభవం నడిచిందని ఇప్పుడు తెలుస్తోంది. కాకతీయుల వారసత్వం క్రీ.శ 972 తర్వాత ఓరుగల్లుకు పాకింది. కాకతీయులు ఓరుగల్లుకు మారటానికి ముందు కొండపల్లి ప్రాంతంలో కీలకంగా వ ్యవహరించారు. గుంటూరు జిల్లాలోని ఈపూరు, చందుపట్లలో రుద్రమదేవి మరణానికి సంబంధించిన శాసనాలను కనుగొన్నారు. రుద్రమ తన భర్త చనిపోయినపుడు గుడిమెట్ల కృష్ణానదీ తీరంలో నిద్ర చేసినట్లు ఆధారాలున్నాయి.