Chandrasekhar Goel: కొల్లేరులో కేంద్ర కమిటీ పర్యటన
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:00 AM
కొల్లేరు ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణతో పాటు ప్రజల స్థితిగతులను కూడా పరిశీలించి సుప్రీంకోర్టు పరిమితులకు లోబడి నివేదిక అందిస్తామని కేంద్ర సాధికార కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్ స్పష్టం చేశారు.
తొలిరోజు ఆరున్నర గంటలకు పైగా పరిశీలన
ఏలూరు, జూన్ 17(ఆంధ్రజ్యోతి): కొల్లేరు ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణతో పాటు ప్రజల స్థితిగతులను కూడా పరిశీలించి సుప్రీంకోర్టు పరిమితులకు లోబడి నివేదిక అందిస్తామని కేంద్ర సాధికార కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్ స్పష్టం చేశారు. కొల్లేరులో రెండురోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని పక్షుల సంరక్షణ కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలను కమిటీ మంగళవారం పరిశీలించింది. దాదాపు ఆరున్నర గంటలకు పైగా ఈ పర్యటన సాగింది. కొల్లేరులో ఎదురవుతున్న సమస్యలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, ధర్మరాజు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణం, పక్షులతో పాటు ఈ ప్రాంతంలోని ప్రజలకు కడుపు నిండా ఆహారం అందించేలా, వారికి తగు న్యాయం చేసేలా చూస్తామని వర్మ భరోసా ఇచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటామని కొల్లేరు వాసులతో రఘురామ ప్రతిజ్ఞ చేయించడంపై కమిటీ సభ్యులు ఆసక్తి కనబరిచారు. కమిటీ పర్యటించిన ప్రాంతాలన్నింటిలోనూ స్థానికులు పెద్దఎత్తున వినతులు అందజేశారు. కమిటీ సభ్య కార్యదర్శులు డాక్టర్ జేఆర్ భట్, జి. భానుమతి, సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాశ్ చంద్రభట్, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.