KL University Students: నింగిలోకి కేఎల్ యూనివర్సిటీ ఉపగ్రహాలు
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:06 AM
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైంది...
మూడు శాటిలైట్ల ప్రయోగం విజయవంతం
వీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామ హాజరు
తాడేపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చాక శనివారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని క్యాంపస్ నుంచి మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. వివిధ అంశాల్లో పరిశోధనలకుగాను యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు రూపొందించిన కేఎల్ శాట్ 2, కేఎల్ జాక్, కాన్ శాట్ ఉపగ్రహాలు రోదశిలోకి వెళ్లాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేఎల్‌యూ వైస్ చైర్మన్ కోనేరు నిఖిల, వీసీ సారథివర్మ సమక్షంలో కేఎల్ జాక్ శాటిలైట్ రూపకర్త కేసీహెచ్ శ్రీకావ్య విద్యార్థులతో కలిసి ఈ ప్రయోగం చేపట్టారు. శాస్త్రీయ పరిశోధన, రియల్‌టైం సమాచారం, పర్యావరణ పర్యవేక్షణకు కేఎల్ శాట్ 2 ఉపగ్రహాన్ని తయారుచేశారు. బెంగళూరుకు చెందిన రెడ్‌వింగ్ సంస్థ సహకారంతో ఫ్లయిట్ మోడ్ డ్రోన్ సాయంతో దీనిని నింగిలోకి పంపారు. నిర్దేశిత కక్ష్యలోనికి వెళ్లిన తరువాత ఈ శాటిలైట్ 12 కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశిత కక్ష్యలో ఒక గంటపాటు 60 కిలోమీటర్లు సమాంతరంగా ప్రయాణించి మళ్లీ లాంచ్‌పాడ్‌పై విజయవంతంగా దిగింది. అత్యంత తేలికగా క్రెడిట్ కార్డు సైజ్ పీకో బెలూన్ మోడల్‌లో కేఎల్ జాక్ ఉపగ్రహాన్ని విద్యార్థులు రూపొందించారు. ఇక కాన్ శాట్ ఉపగ్రహం ప్రధానంగా వాతావరణ మార్పులను, గాలి నాణ్యతను అధ్యయనం చేస్తుంది. ఈ ఉపగ్రహం ఈ నెల 27న ఉత్తరప్రదేశ్‌లో ఇన్‌స్పేస్, ఇస్రో, ఏఎ్‌సఐ సంయుక్తంగా నిర్వహించే పోటీల్లో పాల్గొనడానికి ఎంపికైంది. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ లక్ష్యంలో భాగంగా జరుగుతున్న పోటీలకు కాన్ శాట్ ఉపగ్రహం ఏపీ నుంచి ఎంపికైందని చెప్పారు. ఇది ఒక చరిత్రాత్మక ఘట్టమన్నారు. రఘురామ మాట్లాడుతూ, ఒకేసారి మూడు ఉపగ్రహాలను ప్రయోగించడం గొప్ప విషయమన్నారు. ప్రధాని మోదీ చొరవతో దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కేఎల్‌యూ వైస్ చైర్మన్ కోనేరు నిఖిలా కార్తికేయన్ మాట్లాడుతూ, రాకెట్ ప్రయోగం దిశగా కూడా అడుగులు వేస్తామని, ఉపగ్రహాల రూపకల్పనలో విద్యార్థుల కృషి అమోఘమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోవీసీలు డాక్టర్ ప్రసాద్, వెంకట్రామ్, రాజశేఖరరావు, రిజిస్ట్రార్ సుబ్బారావు, ఆర్ అండ్ డీన్ డాక్టర్ బీటీపీ మాధవ్, అన్ని విభాగాల డీన్‌లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.