Share News

ఇష్టారాజ్యం!

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:39 AM

పండిట్‌ నెహ్ర బస్‌స్టేషన్‌లో వ్యాపారుల దందా నడుస్తోంది. ధరలు పెంచుకుంటామని ఓ క్యాంటీన్‌ నిర్వాహకుడు బస్‌స్టేషన్‌ అధికారికి ప్రతిపాదన పంపాడు. కాదు.. కూడదనడంతో రాజకీయ బలం చూపించాడు. పరిస్థితి అర్థం చేసుకున్న సదరు అధికారి విషయం ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదించారు. అక్కడ పంచాయితీ నడుస్తుండగానే.. సదరు నిర్వాహకుడు ధరలు పెంచుకుని ఎంచక్కా విక్రయాలు చేస్తున్నాడు. దీంతో ప్రయాణికులు ధరలు ఎక్కువుగా ఉన్నాయని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇష్టారాజ్యం!

- పీఎన్‌బీఎస్‌లో వ్యాపారుల దందా!

- ధరలు పెంచుకుంటామని ఓ క్యాంటీన్‌ నిర్వాహకుడి ప్రతిపాదన

- అనుమతి ఇవ్వని బస్‌స్టేషన్‌ అధికారి

- రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు

- ఆర్టీసీ ఉన్నతాధికారుల టెబుల్‌పైకి ప్రతిపాదనల ఫైల్‌

- ఇప్పటి వరకు రాని ఎలాంటి అనుమతి

- అయినా ధరలు పెంచి విక్రయాలు చేస్తున్న నిర్వాహకుడు

- ప్రయాణికుల నుంచి పెరుగుతున్న ఫిర్యాదులు

పండిట్‌ నెహ్ర బస్‌స్టేషన్‌లో వ్యాపారుల దందా నడుస్తోంది. ధరలు పెంచుకుంటామని ఓ క్యాంటీన్‌ నిర్వాహకుడు బస్‌స్టేషన్‌ అధికారికి ప్రతిపాదన పంపాడు. కాదు.. కూడదనడంతో రాజకీయ బలం చూపించాడు. పరిస్థితి అర్థం చేసుకున్న సదరు అధికారి విషయం ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదించారు. అక్కడ పంచాయితీ నడుస్తుండగానే.. సదరు నిర్వాహకుడు ధరలు పెంచుకుని ఎంచక్కా విక్రయాలు చేస్తున్నాడు. దీంతో ప్రయాణికులు ధరలు ఎక్కువుగా ఉన్నాయని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఆసియాలోనే రెండో అతిపెద్దదైన పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌)కు నిత్యం రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలకు కూడా ఆదరణ ఉంది. ఈ డిమాండ్‌ను మరింత క్యాష్‌ చేసుకోవటానికి దుకాణదారులు బరి తెగిస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు తరచూ కేసులు రాసి, జరిమానాలు విధిస్తున్నా వీరు మార్పులేదు. జరిమానాలు అయినా కడతారు కానీ, అధిక ధరలకు విక్రయించటం మాత్రం మానరు. దీన్ని బట్టి చూస్తే ఆర్టీసీ అధికారులు విధించే జరిమానాల కన్నా కూడా అధిక ధరలకు విక్రయాలు జరపటం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువుగా ఉంటోందన్నది అర్థమవుతోంది.

భారీగా ధరలు పెంచుతూ ప్రతిపాదనలు

ఇటీవల కాలంలో బస్‌స్టేషన్‌లోని ఓ క్యాంటీన్‌ నిర్వాహకుడు తమ రెస్టారెంట్‌లో అధిక ధరలను వసూలు చేయాలని భావించాడు. భోజనం (సింగిల్‌, పార్శిల్‌), టీ, కాఫీ, ఇతర అల్పాహారాలకు ధరలను రూ.10 నుంచి రూ. 20 పెంచుకునేలా ప్రతిపాదనలు తయారు చేశాడు. భోజనం సింగిల్‌ రూ.120కి అదనంగా రూ.10, పార్శిల్‌ భోజనం రూ.150కి అదనంగా రూ.10, అల్పాహారాలపై అదనంగా రూ.20, టీపై రూ.5, కాఫీపై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేయటానికి బస్‌స్టేషన్‌ అధికారులకు ప్రతిపాదనలు పంపాడు. డీసీటీఎం దగ్గరకు ముందుగా ఈ ప్రతిపాదన వచ్చింది. దీనిపై డీసీటీఎం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బస్‌స్టేషన్‌లో అధిక ధరలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ధరలను పెంచటానికి అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. అయినప్పటికీ క్యాంటీన్‌ నిర్వాహకుడు ఆ అధికారిపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. తనపై ఒత్తిడి తెస్తున్నారన్న ఉద్దేశ్యంతో సదరు అధికారి క్యాంటీన్‌ నిర్వాహకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ధరలను పెంచటం వల్ల నీ వ్యాపారం మీద కూడా ప్రభావం చూపిస్తుందని, తర్వాత బాధపడతావని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ధరలను పెంచుకోవటానికి అంగీకరించకుండా తనను బుజ్జగించే ప్రయత్నం చేయటంపై క్యాంటీన్‌ నిర్వాహకుడికి కోపం వచ్చింది. తన రాజకీయ బలం చూపించటం ప్రారంభించాడు. దీంతో బస్‌స్టేషన్‌ అధికారి ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు పంపారు.

అనుమతి ఇవ్వకుండానే అదనపు ధరల వసూలు!

ఉన్నతాధికారుల నుంచి ధరల పెంపునకు ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. కానీ, క్యాంటీన్‌ నిర్వాహకుడు మాత్రం అధిక ధరలను వసూలు చేస్తున్నాడు. ఉన్నతాధికారులు అధికారికంగా ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో మౌఖికంగా అనుమతులు ఇచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధిక ధరలు వసూలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవటానికి సిబ్బంది తటపటాయిస్తున్నారు. మరో వైపు బస్‌స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు అధిక ధరలను వసూలు చేస్తున్నారని ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వచ్చేలా బస్‌స్టేషన్‌లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 12:39 AM