Kidney Trafficking: డబ్బు ఆశ చూపి కిడ్నీ కాజేసి..
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:39 AM
ఓ మహిళకు డబ్బులు ఆశ చూపి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పించారు. ఆమెను విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేయించారు.
మదనపల్లెలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
పోలీసుల అదుపులో నిందితులు.. ఏడుగురిపై కేసు
మదనపల్లె, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళకు డబ్బులు ఆశ చూపి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పించారు. ఆమెను విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేయించారు. కానీ.. ఆ మరుసటి రోజే ఆమె మృతిచెందడంతో సీన్ రివర్సయింది. ఇన్నాళ్లూ సీక్రెట్‌గా సాగుతున్న కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది..! దీంతో మదనపల్లె టూటౌన్ పోలీసులు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను టూటౌన్ సీఐ రాజారెడ్డి బుధవారం వెల్లడించారు. విశాఖ జిల్లా అనంతపురం మండలం బొడ్డుపాళేనికి చెందిన ఎస్.యమున(29) భర్త కృష్ణ ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె ఓ దుకాణంలో పనిచేస్తూ తన తొమ్మిదేళ్ల కుమారుడితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో గాజువాక మండలానికి చెందిన పద్మ, సత్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యమునకు డబ్బులు ఆశ చూపి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ఒప్పించారు. వారిలో ఒకరు మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రిలో, ఇంకొకరు కదిరి ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రాల్లో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వారికి అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన బాలరంగడు, సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మెహరాజ్‌తో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో యమునతో చనువుగా ఉండే సూరిబాబు సాయంతో పద్మ, సత్య ఆమెను మదనపల్లెకు తీసుకొచ్చారు. ఇక్కడ బాలరంగడు, మెహరాజ్ ద్వారా ఆదివారం మదనపల్లెలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు.
అదేరోజు డాక్టర్లు యమునకు కిడ్నీ ఆపరేషన్ చేయగా సోమవారం ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని తిరుపతి తీసుకెళ్లిన సూరిబాబు.. వైజాగ్‌లో ఉన్న మృతురాలి తల్లి సూరమ్మకు ఫోన్ చేసి.. మదనపల్లెలో కిడ్నీ ఆపరేషన్ చేసిన తర్వాత యమున మృతిచెందిందని చెప్పాడు. ‘నా కుమార్తెను నువ్వే తీసుకెళ్లి చంపేశావు..’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో భయపడిపోయిన సూరిబాబు 112 నంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు..మదనపల్లె పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు నిందితులను మంగళవారం సాయంత్రం మదనపల్లెలోని గ్లోబల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ గ్లోబల్ ఆస్పత్రి అధినేత, అన్నమయ్య జిల్లా డీసీహెచ్‌ఎస్ (జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త) డాక్టర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సూరమ్మ ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
పిక్నిక్ అని తీసుకెళ్లి చంపేశారు
తన కుమార్తె యమునను పిక్నిక్ పేరుతో తీసుకొచ్చి చంపేశారని మృతురాలి తల్లి సూరమ్మ వాపోయారు. బుధవారం మదనపల్లె టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె మాట్లాడుతూ... యమున సూరిబాబు భార్య కాదని, పిక్నిక్ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకొచ్చి కిడ్నీ ముఠాకు బలిచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.