AP Growth: కియతో కళకళ
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:29 AM
ఒకప్పుడున్న గుట్టలు కనుమరుగై.. పెద్ద పెద్ద భవంతులు, టౌన్‌షి్‌పలు నిర్మితమయ్యాయి. ఒకప్పుడు చీకటి పడితే జనసంచారం లేక, అడవిలా కనిపించే ఈ ప్రాంతం..
రోజురోజుకూ విస్తరిస్తున్న అనుబంధ పరిశ్రమలు
జాతీయ రహదారి పక్కన 20 కి.మీ. పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి పైగా ఉపాధి
ఉమ్మడి అనంత జిల్లా, ఇతర రాష్ట్రాల వారికీ అవకాశాలు
ఒకప్పటి కొండగుట్టలపై ఇప్పుడు ఖరీదైన విల్లాలు
రూ.లక్ష పలికిన ఎకరా.. ఇప్పుడు కోటిన్నర పైనే
నగరాలను తలపించేలా రెస్టారెంట్లు, విల్లాలు, దుకాణాలు
ఒకప్పుడు అక్కడ ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారం.ఉదయం లేవగానే చాలామంది పొలం బాట పట్టేవారు.ఉపాధి లేనివారు బెంగళూరుకు వలస వెళ్లేవారు.అక్కడా పని దొరకకపోతే కుటుంబాలకు కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయేవి.ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం,ముఖ్యంగా పెనుకొండ నియోజకవర్గాల్లోని పరిస్థితి ఇది.
కియతో పాటు అనుబంధ పరిశ్రమల రాకతో ఇప్పుడు ఈ ప్రాంతం రూపురేఖలు చాలా వరకు మారిపోయాయి.ప్రజల జీవనశైలీ మారిపోయింది. వేలాది కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.సమీపంలోని పరిశ్రమలలో ఉపాధి లభించింది. పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు వచ్చాయి.చిన్న ఇళ్లు మేడలయ్యాయి. చిన్న అంగళ్లు సూపర్ మార్కెట్లుగా మారిపోయాయి.టీ స్టాల్ స్థానంలో ఆధునిక కే ఫ్‌లు ఏర్పడ్డాయి. భూములు ధరలు భారీగా పెరిగిపోయాయి.
(హిందూపురం-ఆంధ్రజ్యోతి)
ఒకప్పుడున్న గుట్టలు కనుమరుగై.. పెద్ద పెద్ద భవంతులు, టౌన్‌షి్‌పలు నిర్మితమయ్యాయి. ఒకప్పుడు చీకటి పడితే జనసంచారం లేక, అడవిలా కనిపించే ఈ ప్రాంతం.. ఇప్పుడు విద్యుత్ వెలుగులతో ధగధగలాడుతోంది. శ్రీసత్యసాయి జిల్లాకు కియా కార్ల పరిశ్రమ రాకతో పరోక్షంగా, ప్రత్యక్షంగా 30 వేలమందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాలవారు ఉన్నారు. స్థానికంగా పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, రొద్దం మండలాలలో సరికొత్త జోష్ వచ్చింది. స్థానికంగా వేలాదిమంది కుటుంబాల్లో వెలుగులు నింపింది. కియ కార్ల పరిశ్రమ మొదట 2017లో ఏర్పాటైంది. పెనుకొండ మండలం అమ్మవారిపల్లిలో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభమైంది. ఆ తరువాత దాని అనుబంధ పరిశ్రమలు ఒక్కొక్కటిగా సుమారు 20కి పైగా వచ్చాయి. పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో ఇవి విస్తరించాయి.

మూడేళ్ల క్రితం వరకు పెనుకొండ చుట్టూ ఉన్న పరిశ్రమలు ప్రస్తుతం గోరంట్ల మండలంలోకి విస్తరించాయి. పాలసముద్రం వద్ద కియ అనుబంధ పరిశ్రమలు పదికి పైగా ఉన్నాయి. ఒకప్పుడు కియ ప్రధాన పరిశ్రమలోనే ఉపాధి లభించగా.. ప్రస్తుతం 20 కి.మీ. పరిధిలో అవకాశాలు పెరిగాయి. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. కర్ణాటక నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించాక.. పాలసముద్రం నుంచి సుమారు 20 కి.మీ. పరిధిలో జాతీయ రహదారి పక్కన ఆధునిక రెస్టారెంట్లు, పెద్దపెద్ద భవంతులు కనిపిస్తాయి. జాతీయ రహదారికి ఆనుకుని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
లక్షలు పలికే భూమి కోట్లకు..
ఒకప్పుడు పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి మండలాల్లో ఎకరం భూమి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా పలికేది. కియ, అనుబంధ పరిశ్రమలు రావడంతో భూమి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్నిచోట్ల భూముల విలువ 20 నుంచి 40 రెట్లు పెరిగిందని ఈ ప్రాంత రైతులు అంటున్నారు. గోరంట్ల మండలంలో ఎకరం భూమి ఒకప్పుడు రూ.5 లక్షలు ఉండేది. కియకు తోడు పాలసముద్రం వద్ద మరిన్ని పరిశ్రమలు రావడంతో ఇప్పుడు ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల దాకా పలుకుతోంది. పెనుకొండ చుట్టుపక్కల పదేళ్ల క్రితం రూ.లక్ష నుంచి రూ.2 లక్షలున్న ఎకరం భూమి ప్రస్తుతం రూ.1.5 కోట్లకు చేరింది. సోమందేపల్లి మండల కేంద్రంలో పదేళ్ల క్రితం సెంటు రూ.లక్ష ఉండగా, ప్రస్తుతం రూ.10 లక్షలకు పెరిగింది.
పరిశ్రమల రాకతో...
కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను కియ మార్చి వేసింది. కియ స్థిరపడ్డాక పలు అంతర్జాతీయ సంస్థలు జిల్లాకు వస్తున్నాయి. గోరంట్ల వద్ద నాసిన్ అకాడమీ ఏర్పాటైంది. ఎయిర్‌బస్, బెల్‌తో పాటు మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడికి వస్తోంది. నేడు ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఇటువైపు చూసేలా జిల్లా పారిశ్రామికంగా వృద్ధి చెందుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఇక్కడికి రావడంతో జాతీయ రహదారికి ఆనుకుని పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో టౌన్‌షి్‌పలు ఏర్పాటయ్యాయి. పాలసముద్రం సమీపంలో గుట్టలు, కొండలను చదును చేసి అపార్ట్‌మెంట్‌లు నిర్మించారు. ప్రస్తుతం పాలసముద్రం చుట్టూ పదుల సంఖ్యలో లే అవుట్లు వెలిశాయి. పాలసముద్రం జాతీయ రహదారి సర్కిల్‌లో పదుల సంఖ్యలో దుకాణాలు వృద్ధి చెందాయి. పాలసముద్రం వైపు మరిన్ని సంస్థలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసేందుకు వచ్చేవారికి అద్దెకు ఇచ్చేందుకు, అమ్మేందుకు ఇప్పటికే హిందూపురం రహదారిలో పదుల సంఖ్యలో విల్లాలు నిర్మించారు. గోరంట్ల-బెంగళూరు రహదారి పక్కన.. పాలసముద్రం సమీపంలో మరికొన్ని విల్లాలు ఏర్పాటవుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిలో ఈ ప్రాంతం దూసుకుపోతోంది. నగర వాతావరణాన్ని తలపించేలా పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ ప్రాం తంలో నివసిస్తున్నవారు మార్కెట్‌లో విడుదలైన కొత్త కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.
కూటమి రాకతో భవిష్యత్తుపై ధీమా
కియ పరిశ్రమను రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారు. అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇక్కడకు రావాల్సిన కొన్ని పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. నాడు వైసీపీ నాయకుల దెబ్బకు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి వచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో ఈ పరిస్థితి మారింది. ఇక్కడికి రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ భవిష్యత్తు బాగుంటుందని విశ్వసిస్తున్నారు. చంద్రబాబు పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తారని, ఇక్కడికి మరిన్ని వస్తాయని జిల్లా ప్రజలు అంటున్నారు. మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నారు.
చంద్రబాబుతోనే సాధ్యం
ఎనిమిదేళ్ల క్రితం జీవనోపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లాలనుకున్నాం. కియ పరిశ్రమ రాకతో గ్రాండ్ స్టే విల్లాల వద్ద చిల్లర దుకాణం, టీస్టాల్ పెట్టుకున్నాం. ఎనిమిదేళ్లుగా మా కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నాం. సీఎం చంద్రబాబు కియను మా ప్రాంతానికి తీసుకువచ్చినందుకే ఇది సాధ్యమైంది. ఇక్కడున్న విల్లాలలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు అద్దెకు ఉంటున్నారు.
- హరిప్రసాద్, చిల్లరకొట్టు వ్యాపారి,
పాలసముద్రం, శ్రీసత్యసాయి జిల్లా
టిఫిన్ సెంటర్‌తో జీవనం
పరిశ్రమ రాకతో మా ప్రాంతం, మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందాయి. ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం చాలామంది వచ్చారు. వారి కోసం టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. మా కుటుంబ జీవనం సాఫీగా సాగుతోంది.
- శివారెడ్డి, అమ్మవారిపల్లి,
పెనుకొండ మండలం, శ్రీసత్యసాయి జిల్లా