Share News

Kia Engine Missing Case: కియ ఇంజిన్‌ల మిస్సింగ్‌ కేసులో దర్యాప్తు వేగవంతం

ABN , Publish Date - Apr 12 , 2025 | 06:05 AM

కియ ఇంజిన్‌ల మాయం కేసులో దర్యవప్టు వేగవంతమైంది. తమ్మిళనాడుకు చెందిన ఉద్యోగులపై అనుమానం ఉందని, వారి పాస్‌పోర్టులు సీజ్ చేసి, విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు

Kia Engine Missing Case: కియ ఇంజిన్‌ల మిస్సింగ్‌ కేసులో దర్యాప్తు వేగవంతం

  • డీజీపీ కార్యాలయం నుంచి పర్యవేక్షణ

  • మాజీ ఉద్యోగులపైనే అనుమానం

  • సిట్‌ అదుపులో ఓ అనుమానితుడు

  • అనుమానితులు పారిపోకుండా పాస్‌పోర్టులు సీజ్‌

పెనుకొండ టౌన్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): కియ పరిశ్రమలో కార్‌ ఇంజిన్‌ల మాయం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును డీజీపీ కార్యాలయం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. కియా ఫ్యాక్టరీలో పనిచేసి మానేసిన ఉద్యోగుల నే ఈకేసులో ప్రధానంలో అనుమానిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన ఓ ఉద్యోగిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలినవారిని పట్టుకునేందుకు 20 మంది అధికారుల బృందం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనుమానితులు పారిపోకుండా వారి వీసా, పాస్‌పోర్ట్‌లను సీజ్‌ చేసినట్లు సమాచారం. శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న కియ పరిశ్రమకు సుమారు 54 ప్లాంట్లు ఉన్నాయి. ప్రధాన పరిశ్రమకు తోడు 26 అనుబంధ పరిశ్రమలున్నాయి. ఇక్కడ గంటకు 58 కార్లను తయారు చేస్తారు. రూ.వేల కోట్ల లావాదేవీలు, వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలాంటి పరిశ్రమలో ఏకంగా 940 కార్‌ ఇంజిన్‌లు మాయం కావడం కలకలం రేపింది. దీనిపై ఆ కొరియన్‌ సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్చి 19న అమ్మవారిపల్లిలోని కియ ఇండస్ట్రియల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే రోజు నుంచి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు.


సీరియ్‌సగా తీసుకున్న కియ

కార్‌ ఇంజిన్‌ల మాయం వ్యవహారాన్ని కియ యాజమాన్యం సీరియ్‌సగా తీసుకుంది. ప్లాంట్‌ వ్యాపార లావాదేవీలతో పోల్చుకుంటే మాయమైన ఇంజిన్‌ల విలువ స్వల్పమే అయినా.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని పోలీసులను కోరింది. అక్రమాలకు బీజం ఎక్కడ పడింది? సూత్రధారులు ఎవరు? మాయమైన ఇంజిన్‌లు ఎక్కడికి చేరాయి? అనే అంశాలను నిగ్గు తేల్చాలంది. దీంతో ఇంజిన్‌లను దాచి ఉంచారా, స్ర్కాప్‌, స్పేర్స్‌ కింద విక్రయించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే రాష్ట్రంవారికి ప్రాధాన్యం!

కియ పరిశ్రమలో కార్ల ఉత్పత్తి, ఎగుమతి ప్రక్రియలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉంటాయి. పెనుకొండ మండలం యర్రమంచి పంచాయతీ పరిధిలో కియ పరిశ్రమ ఏర్పాటైనప్పటి నుంచి తమిళనాడుకు చెందిన వ్యక్తులే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కియతో పాటు అనుబంధ పరిశ్రమలలో ఆ రాష్ట్రానికి చెందినవారే కీలక ఉద్యోగాల్లో ఉన్నారు. ఇంజిన్‌ల మిస్సింగ్‌ వెనుక ఆ రాష్ట్ర ఉద్యోగుల ప్రమేయమే ఉంటుందని కియ యాజమాన్యం, పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక రాష్ట్రంవారికే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కారణంగా అక్రమాలు జరిగాయని కియ యాజమాన్యం అంతర్గత చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

Updated Date - Apr 12 , 2025 | 06:05 AM