కోటి ఆశలతో ఖరీఫ్!
ABN , Publish Date - May 27 , 2025 | 12:36 AM
కోటి ఆశలతో ఖరీఫ్‌కు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. కాలువలకు నీటిని విడుదల చేస్తే పనులు చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే అధికశాతం పొలాల్లో వేసవి దుక్కులు దున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు నిలబడి తేమశాతం పెరిగింది. నారుమడులు పోయాలా లేక వెదజల్లే పద్ధతిలో వరి విత్తనాలు చల్లాలా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. రుతు పవనాలు ప్రవేశించి వాతావరణం అనుకూలంగా మారితే పది రోజుల ముందుగానే జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
- జిల్లాలో 1.62 హెక్టార్లలో వరి సాగు!
- పంట రుణాల లక్ష్యం రూ.11,510 కోట్లు
- వెద పద్ధతిలో సాగుపై రైతుల ఆసక్తి
- కృష్ణాడెల్టాకు సాగునీటి విడుదల తేదీ వెల్లడి తర్వాత పనులు ముమ్మరం
కోటి ఆశలతో ఖరీఫ్‌కు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. కాలువలకు నీటిని విడుదల చేస్తే పనులు చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే అధికశాతం పొలాల్లో వేసవి దుక్కులు దున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు నిలబడి తేమశాతం పెరిగింది. నారుమడులు పోయాలా లేక వెదజల్లే పద్ధతిలో వరి విత్తనాలు చల్లాలా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. రుతు పవనాలు ప్రవేశించి వాతావరణం అనుకూలంగా మారితే పది రోజుల ముందుగానే జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1,62,123 హెక్టార్లలో వరి సాగు చేయనున్నట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనిపై ప్రణాళికను ప్రభుత్వానికి పంపగా ఆమోదం లభించింది. అలాగే ఇతర పంటల సాగుపైనా వ్యవసాయశాఖ అంచనాలు రూపొందించింది. చెరకు 3,549 హెక్టార్లు, మినుము 1,340 హెక్టార్లు, వేరుశనగ 724 హెక్టార్లు, పత్తి 298 హెక్టార్లు, వివిధ రకాల పంటలు 133 హెక్టార్లలో సాగు జరుగుతుందని అంచనా వేసింది. 11,600 క్వింటాళ్ల వరి విత్తనాలను క్వింటాకు రూ.500 సబ్సిడీగా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ విత్తనాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా వరి సాగుకు 1.03 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవససరం. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే విత్తనాలు కాకుండా సుమారుగా 90 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి ఉంది. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో ఉత్పత్తి చేసిన ఎంసీఎం-100, ఎంసీఎం-103, ఎంసీఎం-125 విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ పరిశోధనా క్షేత్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యవసాయశాఖ ద్వారా ఈ ఏడాది బీపీటీ 5204, ఎంటీయూ 1061, ఎంటీయూ 1318 వంటి రకాల వరి విత్తనాలను కిలోకు రూ.5 చొప్పున సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. అయితే రైతులు 65 శాతం మేర ఎంటీయూ-1318 రకం వరి వంగడాన్ని సాగు చేసే యోచనలో ఉన్నారు. ఈ రకం వరి వంగడంతో పాటు ఎంటీయూ-1061, 1064, 1121, 7029, 1224, స్వర్ణ, బీపీటీ-3291 వంటి రకాలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవు తున్నారు. నాణ్యమైన విత్తనాలు ఎక్కడ ఉన్నాయనే అంశంపై రైతులు ఆరా తీస్తున్నారు. కంకిపాడు, గన్నవరం, తోట్లవల్లూరు, ఉయ్యూరు. పామర్రు, చల్లపల్లి, మొవ్వ తదితర మండలాల్లో బోరు నీటి ఆధారంగా నారు మడులు పోసేందుకు రైతులు సిద్ధమ వుతున్నారు. గుడ్లవల్లేరు, పెడన, బంటుమిల్లి, గూడూరు, మచిలీపట్నం తదితర మండలాల్లో వెదజల్లే పద్ధతిన వరినాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు.
పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు పంపిణీ
భూసారాన్ని పెంచేందుకు, సాగులో పెట్టుబడి, రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు జిల్లాలో 2,486 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనుము, జీలుగ విత్తనాలు నాలుగు కేజీలు, పిల్లిపెసర రెండు కేజీల బ్యాగుల చొప్పున ఎంపిక చేసిన రైతులకు అందజేశారు. జిల్లాలోని 35 రైతు గ్రూపులకు పురుగు మందులు పిచికారీ చేసేందుకు 35 డ్రోన్‌లను అందజేయనున్నారు. కౌలు రైతులకు 70,500 సీసీఆర్‌సీ కార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ఖరీఫ్‌లో 89 వేల టన్నుల ఎరువులను రైతులు వినియోగిస్తారని వ్యవసాయశాఖ అంచనాగా ఉంది. వరి నాట్లు ప్రారంభమైన తర్వాత ఎరువుల డిమాండ్‌ను బట్టి ముందస్తుగానే ఎరువులను దిగుమతి చేసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి రైతులకు రూ.11,510 కోట్లను పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో కౌలు రైతులకు ఎంతమేర పంట రుణాలు అందిస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది.