CM Chandrababu Naidu: ఖాదీ సంత గ్లోబల్‌గా ఎదగాలి
ABN , Publish Date - Oct 04 , 2025 | 05:06 AM
స్వదేశీ ఉత్పత్తుల కొనుగోళ్ల లక్ష్యంతో మొదలైన ఖాదీ సంత రాబోయే రోజుల్లో గ్లోబల్ సంతగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు...
విజయవాడ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): స్వదేశీ ఉత్పత్తుల కొనుగోళ్ల లక్ష్యంతో మొదలైన ఖాదీ సంత రాబోయే రోజుల్లో గ్లోబల్ సంతగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాట్నంపై నూలు వడికారు. అనంతరం మాట్లాడుతూ.. స్వదేశీ ఉత్పత్తుల పేరిట ఏర్పాటు చేసిన ఈ ఖాదీ సంత విజయం సాధిస్తుందని చెప్పారు. ఖాదీ సంత.. భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా మారుతుందన్నారు. ఆర్థికంగా అగ్రస్థానానికి చేరటమే దేశం ముందు లక్ష్యమన్నారు. రాష్ట్ర ఉత్పత్తులకు బ్రాండింగ్ వచ్చేలా చేయాలని కోరారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొబ్బరి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ఇలా వేర్వేరు నాణ్యమైన ఉత్పత్తులు తయారు అవుతున్నాయని, వాటికి మనమే ప్రచారం చేసుకోవాలని సూచించారు. కళల్ని, చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా.. చేనేత కళాకారులు నేసిన అగ్గిపెట్టెలో పట్టే చీరను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు చంద్రబాబు బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కూటమి నేతలు పాల్గొన్నారు.