Share News

SIT: మద్యం స్కాంలో.. శ్రీధర్‌రెడ్డిది ప్రముఖ పాత్ర

ABN , Publish Date - Dec 13 , 2025 | 06:19 AM

మద్యం కుంభకోణం కుట్రలో సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ-6) కీలకపాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొంది.

SIT: మద్యం స్కాంలో.. శ్రీధర్‌రెడ్డిది ప్రముఖ పాత్ర

  • పాలసీ రూపకల్పన, ముడుపుల వసూళ్లలో ఆయనే కీలకం

  • ఆయనకు బెయిలిస్తే దర్యాప్తునకు ఆటంకం

  • హైకోర్టుకు ‘సిట్‌’ సీనియర్‌ న్యాయవాది అగర్వాల్‌ నివేదన

అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కుట్రలో సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ-6) కీలకపాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొంది. మద్యం పాలసీ రూపకల్పనకు ముందు అధికారులు, ఇతర ప్రైవేటు వ్యక్తులతో జరిపిన సమావేశం లో ఆయన కూడా ఉన్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ‘తాము చెప్పిన కంపెనీలకే ఆర్డర్లు ఇవ్వాలని పిటిషనర్‌ అధికారులను ఆదేశించారు. పాలసీ రూపకల్పన, ముడుపుల వసూళ్లలో శ్రీధర్‌రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని నిందితులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. ముడుపులివ్వని ప్రముఖ మద్యం బ్రాండ్ల కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వకుండా పక్కనపెట్టారు. మద్యం ఉత్పత్తి కంపెనీలతో సంప్రదింపులు జరిపి, వాటి నుంచి ముడుపుల వసూలులో శ్రీధర్‌రెడ్డిది ప్రముఖ పాత్ర. మద్యం పాలసీ ద్వారా ఆయనకు చెందిన ఎస్పీవై ఆగ్రోస్‌ రూ.1,569 కోట్లు లబ్ధి పొందింది. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉంది. సాక్ష్యాలు సేకరించాల్సి ఉంది. ఈ దశలో శ్రీధర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తునకు ఆటం కం కలుగుతుంది. ఆయన బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరించండి’ అని సిట్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ అగర్వాల్‌ కోరారు. అంతకుముందు శ్రీధర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు నగేశ్‌రెడ్డి, అభయ్‌ సిద్ధాంత్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ 7 నెలలకు పైగా జైల్లో ఉన్నారని.. ఎస్పీవై ఆగ్రోస్‌ కంపెనీని నిందితుల జాబితాలో చేర్చకుండా ఆయన్ను బాధ్యుడిని చేయడానికి వీల్లేదని.. తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రకటించారు.

Updated Date - Dec 13 , 2025 | 06:21 AM