SIT Investigation: లిక్కర్ స్కామ్‌లో వైఎస్ అనిల్ రెడ్డి పీఏ
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:54 AM
మాజీ సీఎం జగన్ కుటుంబ వ్యాపారాలు చూసుకునే ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడు దేవరాజన్‌ను లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారిస్తున్నట్టు తెలిసింది.
దేవరాజన్‌ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
నిందితుడు బాలాజీదీ, ఈయనదీ కుప్పమే..
రాజ్ కసిరెడ్డి ఇచ్చిన సొమ్ము అంతిమ లబ్ధిదారుకు?
రాజ్ మనిషి చాణక్యతో రోజూ ఫోన్ సంభాషణ
ధనుంజయ్, కృష్ణమోహన్, చెవిరెడ్డితో భేటీలు
జగన్ ఆర్థిక వ్యవహారాలు చూసే అనిల్‌రెడ్డిపై కీలక సమాచారం ఇచ్చిన దేవరాజన్!
ఆధారాలు లభించాక అనిల్‌ను విచారించే వీలు
లిక్కర్ స్కామ్‌లో మరో కీలక లింక్‌ను సిట్ సంపాదించింది. జగన్ ఆర్థిక వ్యవహారాలు చూసే వైఎస్ అనిల్‌రెడ్డి పీఏను రెండురోజులుగా అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్‌రెడ్డికి సంబంధించిన కొత్త సమాచా రం సిట్‌కు దొరికినట్టు తెలిసింది.
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ కుటుంబ వ్యాపారాలు చూసుకునే ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడు దేవరాజన్‌ను లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారిస్తున్నట్టు తెలిసింది. వైసీపీ హయాం నాటి ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలానికి చెందిన దేవరాజన్.. అనిల్‌రెడ్డి వద్ద నమ్మకస్తుడిగా కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు. అదే మండలానికి చెందిన బాలాజీ గోవిందప్ప(భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్)ను ఈ కేసులో సిట్ అధికారులు మూడు నెలల క్రితం అరెస్టు చేసి జైల్లో పెట్టారు. గోవిందప్పతో పాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, భూనేటి చాణక్య, రాజ్ కసిరెడ్డితో దేవరాజన్ నిరంతర సంబంధాల్లో ఉన్నారని చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు ఓకే.. గాట్ ఇట్.. రిసీవ్డ్.. అంటూ ఎస్‌ఎంఎస్‌లు పంపినట్లు టెక్నాలజీ సాయంతో ‘సిట్’ తేల్చింది.
ఈ వ్యవహారాలన్నీ నిగ్గు తేల్చేందుకు దేవరాజన్‌ను విజయవాడకు పిలిపించి రెండు రోజులుగా ప్రశ్నిస్తోంది. ‘ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పతో ఏమిటీ నీకున్న సంబంధం’’ అని ప్రశ్నించినట్టు సమాచారం. వ్యాపారుల నుంచి మద్యం ముడుపులు వసూలు చేసి రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు ఎవరి వాటా వారికి బూనేటి చాణక్య అనే వ్యక్తి చేర్చాడు. విచారణ సందర్భంగా.. ‘చాణక్యతో ప్రతి రోజూ ఫోన్ ఎందుకు మాట్లాడా’వని ప్రశ్నించగా, అత్యంత కీలక సమాచారాన్ని దేవరాజన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సమాచారానికి తగిన ఆధారాలు సేకరించి వైఎస్ అనిల్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్లు అక్రమంగా ఆర్జించిన జగన్ ఆ డబ్బును వైట్ మనీగా చూపించుకునే క్రమంలో సండూర్ పవర్ ప్లాంట్, సరస్వతి పవర్, భారతీ సిమెంట్స్, కార్మేల్ ఏషియా వంటి పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ పెట్టినట్లు సీబీఐ తేల్చింది. చెన్నైలో సొంత వ్యాపారాలు చేసుకుంటూ.. జగన్ ఆర్థిక వ్యవహరాలను కూడా అనిల్‌రెడ్డి చక్కబెడుతున్నారు.