Share News

AP Cabinet Subcommittee: ఒకే డివిజన్‌లో అసెంబ్లీ స్థానం

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:04 AM

ప్రాంతాల మధ్య సమతౌల్యం, ఆర్థిక, సామాజిక అంశాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై కసరత్తు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

AP Cabinet Subcommittee: ఒకే డివిజన్‌లో అసెంబ్లీ స్థానం

  • పెద్ద నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్‌ హోదా!!

  • ఒకే డివిజన్‌ పరిధిలోకి ఉదయగిరి.. తిరుపతి జిల్లాలోకి నగరి..

  • మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక చర్చ.. డివిజన్లు, మండలాల

  • మార్పుపై కసరత్తు.. మరింత అధ్యయనానికి రెవెన్యూ శాఖకు ఆదేశం

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రాంతాల మధ్య సమతౌల్యం, ఆర్థిక, సామాజిక అంశాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై కసరత్తు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ దిశగా మరింతగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని, అందులో ప్రజాప్రతినిధులు, ప్రాంతాల ఆకాంక్షలు ప్రతిబింబించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ప్రత్యేకించి ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండేలా కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేసింది. దాని నివేదిక ఆధారంగా కొత్త డివిజన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు చేయనుంది. వీలైనంత త్వరగా రిపోర్టు సిద్ధం చేస్తే మరోసారి సమావేశమవ్వాలని నిశ్చయించింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన ఉపసంఘం బుధవారం సాయంత్రం అమరావతి సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు పి.నారాయణ, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ తదితరులు హాజరయ్యారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, మార్గదర్శకాల నేపథ్యంలో ఆ శాఖ జిల్లా, డివిజన్ల కూర్పుపై ఓ నివేదికను ఉపసంఘం ముందుంచింది. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలో ఇప్పటికే స్పష్టత వచ్చినందున.. ఉపసంఘం బుధవారం ప్రధానంగా రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలపై చ ర్చించింది.


ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం రెంటికిపైగా రెవెన్యూ డివిజన్లలో విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గంలోని మండలాల ప్రజలు మూడు ఆర్‌డీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక రెవెన్యూ డివిజన్‌లోనే సర్దుబాటు చేసేలా కొత్త డివిజన్లను ప్రతిపాదించాలని మంత్రులు రెవెన్యూ శాఖకు సూచించారు. ఉదయగిరి తరహాలో రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని డివిజన్లలో ఉన్నాయి.. వాటిని ఒకే రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎలా సర్దుబాటు చేయాలి.. కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయాలా.. ఈ అంశాలపై సమగ్ర ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. దీనిపై తక్షణమే కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకోవాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలుగా ఉంటూ పెద్ద మండలాలుగా ఉన్నవి.. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు అవకాశం ఉన్న పెద్ద నియోజకవర్గాల వివరాలు కూడా కోరారు. ఉదయగిరి, మడకశిర రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు. వాటిని ప్రత్యేక డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు చర్చకొచ్చాయి. అలాగే కందుకూరు, అద్దంకి, పుంగనూరు నియోజకవర్గాలనూ డివిజన్లుగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు.


శాస్త్రీయంగా పునర్‌వ్యవస్థీకరణ: అనగాని

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను ప్రజల ఆకాంక్షల మేరకు శాస్త్రీయంగా చేపడతామని మంత్రి అనగాని చెప్పారు. గతంలో జిల్లాల విభజనలో వచ్చిన ఇబ్బందులను తీరుస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారని.. జగన్‌ చేసిన తప్పుల వల్ల ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం చూపుతామని తెలిపారు. జనగణనకు ముందే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై నివేదిక ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.

పెద్ద గ్రామాలు మండలాలుగా..

ఒక మండలం పరిధిలో ఆర్ధికాభివృద్ధికి బాగా అవకాశం ఉన్న పెద్ద గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజల కోరిక మేరకు వాటిని మండలాలుగా ఏర్పాటు చేసే అంశం కూడా ఉపసంఘం సమావేశంలో చర్చకొచ్చింది. అలాగే కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు, రెవెన్యూ మండలాలు, డివిజన్లను ఇతర జిల్లాలకు మార్చే అంశాన్నీ సబ్‌కమిటీ పరిశీలిస్తోంది. ఉదాహరణకు.. చిత్తూరులో ఉన్న నగరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నారు. నగరి స్థానం పరిధిలోని రెండు మండలాలు తిరుపతిలో, మూడు మండలాలు చిత్తూరులో ఉన్నాయి. మొత్తం నగరిని తిరుపతి జిల్లా, రెవె న్యూ డివిజన్‌ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకున్నాక శుక్రవారం లేదా సోమవారం (3న) మరోసారి సమావేశమై.. దీనిపై ఓ స్పష్టతకు రావాలని ఉపసంఘం నిర్ణయించింది.

Updated Date - Oct 30 , 2025 | 04:06 AM