Share News

TTD Executive Officer: టీటీడీ ఈవోగా మళ్లీ సింఘాల్

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:23 AM

సుదీర్ఘ కసరత్తు తర్వాత రాష్ట్రంలో 11 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కీలకమైన శాఖలు అప్పగించింది. కేంద్ర సర్వీసుల నుంచి తిరిగొచ్చి పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న...

TTD Executive Officer: టీటీడీ ఈవోగా మళ్లీ సింఘాల్

  • ఈవో శ్యామలరావు జీఏడీకి

  • 11 మంది సీనియర్‌ ఐఏఎస్‌ల బదిలీ

  • గవర్నర్‌ స్పెషల్‌ సీఎ్‌సగా అనంతరాము

  • కృష్ణబాబుకు ఆర్‌ అండ్‌ బీ, రవాణా

  • అదనంగా మౌలిక వసతులు,పెట్టుబడుల శాఖ అప్పగింత

  • అటవీ శాఖకు కాంతిలాల్‌ దండే

  • మీనాకు ఎక్సైజ్‌, పరిశ్రమలు, వాణిజ్యం

  • కార్యదర్శులుగా గౌర్‌, శ్రీధర్‌, శేషగిరిబాబు

  • దేవదాయ కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌

అమరావతి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ కసరత్తు తర్వాత రాష్ట్రంలో 11 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కీలకమైన శాఖలు అప్పగించింది. కేంద్ర సర్వీసుల నుంచి తిరిగొచ్చి పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న జె.శ్యామలరావును సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ-పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీచేసింది. ప్రస్తుతం అక్కడున్న ముకేశ్‌కుమార్‌ మీనాను రెవెన్యూ (ఎక్సైజ్‌) ముఖ్య కార్యదర్శిగా నియమించింది. అటవీ-పర్యావరణ శాఖ స్పెషల్‌ సీఎస్‌గా ఉన్న జి.అనంతరామును బదిలీచేసి గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సింఘాల్‌ గతంలోనూ టీటీడీ ఈవోగా పనిచేశారు. చంద్రబాబు హయాంలో 2017 మే 6న ఈ బాధ్యతలు చేపట్టిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో 2020 అక్టోబరు 4 వరకు పనిచేశారు. ఐదేళ్ల తర్వాత రెండోసారి ఈ పదవిలో నియమితులు కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల్లో శ్రీలక్ష్మి తర్వాత జి.అనంతరాము రెండోస్థానంలో ఉన్నారు. ఆయన సీనియారిటీకి గౌరవం ఇచ్చిన ప్రభుత్వం.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ప్రత్యేక సీఎస్‌గా నియమించింది. ఆర్‌ అండ్‌ బీ, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్‌ దండేను అటవీ-పర్యావరణ శాఖకు బదిలీ చేసింది. మీనాకు పరిశ్రమలు, వాణిజ్య (మైనింగ్‌) విభాగం ముఖ్య కార్యదర్శిగానూ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. కమిషనర్లుగా అద్భుత పనితీరు కనబరచిన సౌరభ్‌ గౌర్‌, సీహెచ్‌ శ్రీధర్‌, ఎంవీ శేషగిరిబాబులను కార్యదర్శులుగా నియమించింది.


  • వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌గా ఉన్న ఎంటీ కృష్ణబాబు ఆర్‌ అండ్‌ బీ, రవాణా శాఖల స్పెషల్‌ సీఎస్‌గా నియమితులయ్యారు. దీంతోపాటు మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక సీఎ్‌సగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖను అదనంగా నిర్వహిస్తున్న యువరాజ్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు.

  • పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు.

  • పౌరసరఫరాల కమిషనర్‌గా ఉన్న సౌరభ్‌ గౌర్‌ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఆయన పౌరసరఫరాల కమిషనర్‌గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

  • మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న సీహెచ్‌ శ్రీధర్‌ను అదే శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయన కమిషనర్‌గానూ అదనపు విధులు నిర్వహిస్తారు.

  • కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న శేషగిరిబాబును కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్‌, బీమా వైద్య సేవల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన కార్మిక కమిషనర్‌గానూ కొనసాగుతారు.

  • రిటైర్‌మెంట్‌ తర్వాత పునర్నియమితులై.. గవర్నర్‌ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎం.హరి జవహర్‌లాల్‌ను ప్రభుత్వం కీలమైన దేవదాయ శాఖ కార్యదర్శిగా నియమించింది. ఆయన వైసీపీ ప్రభుత్వంలో దేవదాయ కమిషనర్‌గా విధులు నిర్వహించారు.

Updated Date - Sep 09 , 2025 | 04:35 AM