Adulterated Liquor Case: కాకాణి ఫైల్స్ మిస్సింగ్
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:44 AM
అదేం వింతో కానీ మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పలు నేరారోపణలతో కోర్టు కెక్కిన కేసులకు సంబంధించిన ఫైళ్లు వరుసగా అదృశ్యం అవుతున్నాయి.
2014 నాటి కల్తీ మద్యం పంపిణీ కేసులో
నెల్లూరు కోర్టులో కీలక ఫైళ్లు అదృశ్యం
2018 చివర్లోనే గుర్తించిన బెజవాడ ప్రత్యేక కోర్టు
2019లో వైసీపీ గెలవడంతో కేసు మూలకు
తాజాగా ఫైళ్ల గల్లంతు విషయం వెలుగులోకి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కేసులో కూడా..
(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)
అదేం వింతో కానీ మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పలు నేరారోపణలతో కోర్టు కెక్కిన కేసులకు సంబంధించిన ఫైళ్లు వరుసగా అదృశ్యం అవుతున్నాయి. సురక్షితమైన న్యాయస్థానం(నెల్లూరు) నుంచి కాకాణి కేసులకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడం పట్ల విస్తుపోతున్నారు. 2023లో కాకాణిపై మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన ఫైళ్లపై దొంగలు పడ్డారు. అప్పట్లో ఇది చిత్తు కాగితాలు ఏరుకునేవారు చేసిన చిల్లర దొంగతనంగా పోలీసులు లెక్కతేల్చారు. 2014 ఎన్నికల సమయంలో కాకాణిపై నమోదైన కల్తీ మద్యం కేసుకు సంబంధించిన ఫైళ్లలోనూ కీలక డాక్యుమెంట్లు అదృశ్యమైనట్టు తాజాగా వెలుగు చూసింది. 2018 చివర్లోనే విజయవాడలోని ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని గుర్తించింది. అదృశ్యమైన కీలక డాక్యుమెంట్లను తిరిగి భర్తీ చేసే పనిని అప్పట్లో సీఐడీకి అప్పగించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ కేసును మూలన పడేసింది. ఐదేళ్లూ పట్టించుకోలేదు. గతేడాది కూటమి ప్రభుత్వం రావడంతో కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ప్రస్తుతం నెల్లూరు సీఐడీ అధికారులు కాకాణి కల్తీ మద్యం కేసుకు సంబంధించి అదృశ్యమైన కీలక డాక్యుమెంట్లను తిరిగి భర్తీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాకాణి కేసుల్లో ఎవరి ప్రమేయం లేకుండా సాధారణంగా జరిగిన మిస్సింగ్‌లా లేక వ్యూహాత్మకంగా జరుగుతున్న మిస్సింగ్‌లా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
2014 నాటి కేసు
2014 ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ నాయకులు పంపిణీ చేసిన మద్యం తాగి వందల సంఖ్యలో ఆసుపత్రుల పాలయ్యారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఎక్సైజ్ అధికారులు రంగంలోకి మద్యం పంపిణీ చేసిన వారిని పట్టుకొని ప్రశ్నించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మద్యం సరఫరా చేశారని, ఆయన గెలుపుకోసం తాము పంపిణీ చేశామని వారంతా విచారణలో చెప్పారు. దీంతో కాకాణితో పాటు మద్యం పంచిన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఇదే తరహాలో కావలి నియోజకవర్గంలోనూ జరిగింది. అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పరెడ్డిపై కేసులు నమోదు చేశారు. ఈ రెండు చోట్ల ఈ ఇద్దరు నాయకుల అత్యంత సన్నిహితులైన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, మన్నెమాల సుకుమార్‌రెడ్డిలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ కేసులను సీఐడీకి అప్పగించింది. సీఐడీ చాలా లోతుగా దర్యాప్తు చేసి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గోపాలకృష్ణ అలియాస్ అప్పు ద్వారా కల్తీ మద్యం తెప్పించారని ధ్రువీకరించుకుంది. అతడ్ని అదుపులోకి తీసుకుంది. కల్తీ మద్యానికి ప్రముఖ కంపెనీల లేబుళ్లు అతికించి ప్రజలకు పంపిణీ చేశారని, ఇది చాలా హానికరమైన మద్యమని ల్యాబ్ పరీక్షల ద్వారా నిర్ధారించుకుంది. ఈ ఆధారాలతో పాటు 2017 చివర్లో చార్జిషీట్ వేశారు. నెల్లూరు కోర్టులో కాకాణిపై నాలుగు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఆరు కేసులు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2018లో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ కేసులను అక్కడికి బదలాయించారు. ఈ ఫైళ్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టు.. ఇందులో కీలక డాక్యుమెంట్లు అదృశ్యమయ్యాయని, వాటిని భర్తీ చేసి మళ్లీ సమర్పించాలని ఆ ఏడాది చివర్లో నెల్లూరు కోర్టుకు పంపింది. నెల్లూరు కోర్టు ఆ పనిని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీకి అప్పగించింది. ఇంతలో ఎన్నికలు రావడం, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ఫైలు మూలనపడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై దృష్టి సారించడంతో కదలిక వచ్చింది.
ఇవీ మిస్సింగ్‌లు.. సీసీ నంబర్: 56-17
ఏ1 రిమాండ్ రిపోర్టు
ఏ2 సరెండర్ పిటిషన్
ఏ6 బెయిల్ బాండ్, రిలీజ్ ఉత్తర్వులు మినహా ఇతర డాక్యుమెంట్లు లేవు
ఏ7 మెమో, పీటీ వారెంట్‌తో పాటు మిగిలిన పత్రాలు
ఏ8 బెయిల్ బాండ్, వారెంట్ మినహా ఇతర పత్రాలు లేవు
సీసీ నంబర్: 57
ఏ6 బెయిల్ బాండ్, వారెంట్ మాత్రమే ఉన్నాయి. క్యాష్‌బాండ్‌తో పాటు మిగిలిన పత్రాలు లేవు
ఏ7 మెమో
ఏ8 క్యాష్ బాండ్‌తో పాటు ఇతర పత్రాలు లేవు
ఏ10 పీటీ వారెంట్ మినహా ఇతర పత్రాలు లేవు
సీసీ నంబరు: 58
ఏ1 ష్యూరిటీ బాండ్లు
ఏ3 బెయిల్ బాండ్ రౌండ్ సీల్
ఏ5 క్యాష్ బాండ్, ఏ6 క్యాష్ బాండ్‌లు
సీసీ నంబరు: 59
ఏ1 బెయిల్ బాండ్, వారెంట్, చార్జిషీట్ నీట్ కాపీ లేవు
కాకాణి 11వ నిందితుడిగా ఉన్న ఈ కేసుల్లో మిగిలిన నిందితులకు సంబంధించిన ఫైళ్లు అదృశ్యమయ్యాయి. కానీ ఒక్క కేసు లో కూడా కా కాణికి సంబంధించిన ఫైల్ ఏదీ మిస్ కాలేదు. కేసును నీరుగార్చేందుకు వ్యూహాత్మకంగానే ఇతర నిందితుల ఫైళ్లను అదృశ్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిందితుడుగా ఉన్న కల్తీ మద్యం కేసుల్లోనూ కీలక డాక్యుమెంట్లు అదృశ్యమయ్యాయి.
వెంకటాచలంలో కాకాణిపై కేసు
వెంకటాచలం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై శనివారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేసు నమోదు చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కాకాణి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరి రాధాకృష్ణమనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రమోహన్‌రెడ్డి దేవదాయ భూములు రూ.కోట్లకు అమ్మేశారంటూ కాకాణి అర్థరహిత విమర్శలు చేశారని, ‘వెర్రి పువ్వా నిన్నుకొట్టి చదువు నేర్పిస్తా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.