Vijaysai Reddy: పని ఉంది.. పది రోజుల్లో వస్తా..
ABN , Publish Date - Jul 13 , 2025 | 05:16 AM
మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తి, వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టారు.
సిట్ విచారణకు సాయిరెడ్డి డుమ్మా
శరత్‌చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి కూడా గైర్హాజరు
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తి, వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టారు. రూ. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడు(ఏ-5) సాయిరెడ్డిని శనివారం విచారణకు హాజరుకావాలంటూ దర్యాప్తు బృందం ఇటీవల నోటీసులు ఇచ్చింది. సాక్షిగా ఆయన్ను పిలిచినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత పని ఉందని, ఢిల్లీ నుంచి వచ్చేందుకు పది రోజులు పడుతుందని సాయిరెడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. సాయిరెడ్డితో పాటు విచారణకు రావాల్సిన ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి, అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి సైతం గైర్హాజరు అయ్యారు. ఈనెల 24న వస్తామంటూ సమాచారం ఇచ్చారు.
విజయసాయి.. కర్మ ఫలం
విజయసాయి శనివారం ఎక్స్‌వేదికగా భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని, దాని అర్థాన్ని పోస్టు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశారు. ‘‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన!’’ శ్లోకాన్ని ఆయన పోస్టు చేయడం చూసి దానిలోని అంతరార్థం ఏమై ఉంటుందోనని వైసీపీ నేతలూ.. రాజకీయవర్గాలూ పలురకాలుగా విశ్లేషించుకుంటున్నారు.