Share News

Veerayya Chaudhary: వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన సూత్రధారి ముప్పా సరెండర్‌

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:45 AM

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసులో..

Veerayya Chaudhary: వీరయ్య చౌదరి హత్య కేసులో  ప్రధాన సూత్రధారి ముప్పా సరెండర్‌

  • ముందస్తు బెయిల్‌ తిరస్కరించిన సుప్రీం కోర్టు

  • విధిలేక ఎస్పీ ఎదుట లొంగుబాటు.. గోప్యంగా విచారణ

ఒంగోలు క్రైం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసులో ప్రధాన సూత్రధారి ముప్పా సురేశ్‌ గురువారం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ ఎదుట లొంగిపోయాడు. అతన్ని పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరయ్యచౌదరి ఒంగోలులో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలలుగా సురేశ్‌ పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్‌ కోసం జూలై 27న సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా ఈ నెల 11న విచారించింది. ఈ సందర్భంగా వీరయ్యచౌదరి హత్యకేసులో ప్రధాన నిందితుడు వినోద్‌కు సురేశ్‌ వ్యాపార సంస్థల నుంచి నగదు బదిలీ అయినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితులతో మాట్లాడిన సురేశ్‌ కాల్‌ డేటాను కూడా సమర్పించారు. దీంతో ఆయన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అప్పటికే అతనికి హైకోర్టులో కూడా చుక్కెదురవడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులకు లొంగిపోయాడు. ఈ కేసులో అరెస్టు అయిన 9 మందిలో నలుగురికి ఇప్పటికే బెయిల్‌ మంజూరైంది. నలుగురు కిరాయి హంతకులతో పాటు ప్రధాన నిందితుడు వినోద్‌ రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 04:45 AM