SIT Investigation: మద్యం స్కామ్‌లో సత్యప్రసాద్‌పై చర్యలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:42 AM
జగన్ జమానాలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో అత్యంత కీలక భూమిక పోషించిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్(ఏ-3)పై చట్టపరమైన చర్యలకు...
సర్కారు పచ్చజెండా.. కోర్టులో సిట్ మెమో
అరెస్టు చేయొచ్చని ప్రచారం
స్కామ్ ప్లాన్ తయారీలో ఈయనే కీలకం
ఏ-1 రాజ్ కసిరెడ్డి ఆదేశాల అమలు,ముఖ్యులతో తరచూ సమావేశాలు
ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదన
అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జగన్ జమానాలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో అత్యంత కీలక భూమిక పోషించిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్(ఏ-3)పై చట్టపరమైన చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమాయత్తమవుతోంది. ఈ వ్యవహారంలో ఆయన అప్రూవర్‌గా మారారు. అయినంత మాత్రాన ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. దరిమిలా ఆయన పాత్రపై రాష్ట్రప్రభుత్వానికి సిట్ పూర్తి వివరాలు సమర్పించింది. ఆయనపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో తదనంతర చర్యలకు సిట్ ఉపక్రమించింది. విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలుచేసింది. ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఇప్పటికే సత్యప్రసాద్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్లు 7, 7ఏ, 8, 9, 12, 13(1)(బీ).. అవినీతి నిరోధక చట్టం 13(2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కాంలో కింగ్ పిన్ అయిన రాజ్ కసిరెడ్డి (ఏ-1) కనుసన్నల్లో ఎక్సైజ్ శాఖ నడిచేలా చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారని పేర్కొంది. అప్పట్లో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న సత్యప్రసాద్.. 2019-24 మధ్య రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌లో మార్కెటింగ్ ప్రత్యేక అధికారిగా చక్రం తిప్పారన్నది ప్రధాన అభియోగం. కన్ఫర్డ్ ఐఏఎస్‌గా తనకు అవకాశం కల్పించాలని వైసీపీ ముఖ్యనేతల కోరిక బయటపెట్టారని.. ఇందుకు ప్రతిఫలంగా మొత్తం కుంభకోణానికి రూపకల్పన చేశారని సిట్ ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి నేరుగా లిక్కర్ విక్రయుంచడం నుంచి డిస్టిలరీల స్వాధీనం, నాసికరం బ్రాండ్లు మార్కెట్లో దించడం, ధరలు పెంచడం, ఆ తర్వాత కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు వసూలు చేయడం వరకూ ప్లాన్ మొత్తం సత్యప్రసాద్ తయారుచేశారని.. వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి(మాజీ)తో పాటు జగన్ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చిన డి.వాసుదేవరెడ్డి తదితరులతో తరచూ సమావేశమై 2019 అక్టోబరునాటికి పకడ్బందీగా సిద్ధం చేశారని సిట్ వర్గాలు తెలిపాయి. లిక్కర్ ఆర్డర్లు, డిపోల్లో సరఫరా, ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్లలో మద్యం విక్రయాలన్నీ ఈయనే నియంత్రించారనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయని వెల్లడించాయి.