Minister Payyavula Keshav: సీమలో ఆదాయం పెరగాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:09 AM
రాయలసీమ రైతులకు ఆదాయం మరింత పెరగాలన్నా, సిరులు పండించాలన్నా ఉద్యానవన సాగును మరింత విస్తృతంగా చేపట్టడమే సరైన మార్గమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
పారిశ్రామికాభివృద్ధితోపాటు ఉద్యానసాగు పెంచాలి
అధికారులకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సూచన
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాయలసీమ రైతులకు ఆదాయం మరింత పెరగాలన్నా, సిరులు పండించాలన్నా ఉద్యానవన సాగును మరింత విస్తృతంగా చేపట్టడమే సరైన మార్గమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. సీమప్రాంత అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..‘రాయలసీమ ప్రాంతానికి అద్భుతమైన అభివృద్ధి జరిగేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వివిధ రకాల పరిశ్రమలు, కంపెనీలు పెడుతున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు పరిశ్రమల వైపు నుంచే కాకుండా ఉద్యానవనసాగు ద్వారా మరింత ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలి. పొరుగురాష్ట్రాలతో మెరుగైన కనెక్టివిటీ ఉండటం రాయలసీమకున్న పెద్ద వరం. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలకు సీమతో కనెక్టివిటీ ఉంది. ఇలాంటి అవకాశాలను వినియోగించుకుని ఉద్యాన ఉత్పత్తులను ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేయవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల ఉద్యానపంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ఇతర దేశాలకూ ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యాన పంటల అభివృద్ధికి కావాల్సిన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కియా పరిశ్రమతో అనంతపురం జిల్లాకు ఆదాయం పెరిగింది. జిల్లా జీఎస్డీపీ పెరిగింది. జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో విశాఖ తర్వాత అనంతపురం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు సీమప్రాంతానికి పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే పరిశ్రమలకు మించిన స్థాయిలో ఉద్యాన పంటల ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. సీమలో 2 ఎకరాల్లో ఉద్యాన పంటలు వేస్తే లక్షలు, కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. ఆర్గానిక్ పంటలు పండిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. సంపద సృష్టి పరిశ్రమల ద్వారానే కాదు పంటల ద్వారా కూడా చేయవచ్చని రాయలసీమ రైతులు నిరూపించాలి’ అన్నారు.