Share News

Excise Police: నకిలీ మద్యం కేసులో కేరళ వ్యక్తుల అరెస్టు, రిమాండ్‌

ABN , Publish Date - Nov 05 , 2025 | 06:03 AM

నకిలీమద్యం కేసులో కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులను మదనపల్లె ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. త్రిసూర్‌ జిల్లా కైపమంగళం ప్రాంతానికి చెందిన కె.ఎస్‌. జినేశ్‌(50), అతని అనుచరుడు..

Excise Police: నకిలీ మద్యం కేసులో కేరళ వ్యక్తుల అరెస్టు, రిమాండ్‌

గోవా నుంచి స్పిరిట్‌ సమకూర్చిన జినేశ్‌, అతని అనుచరుడు శిబు

ములకలచెరువు(అన్నమయ్య), నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నకిలీమద్యం కేసులో కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులను మదనపల్లె ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. త్రిసూర్‌ జిల్లా కైపమంగళం ప్రాంతానికి చెందిన కె.ఎస్‌. జినేశ్‌(50), అతని అనుచరుడు.. కన్నూర్‌ జిల్లా పెరింతట్టకు చెందిన శిబు (45)ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. జినేశ్‌ గోవాలో ఉంటూ స్పిరిట్‌ను సేకరించి ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన బెంగళూరుకు చెందిన బాలాజీకి పంపేవాడని తేలింది. అలాగే జినేశ్‌ సూచనలతో అతని అనుచరుడు, డ్రైవర్‌ శిబు స్పిరిట్‌ను గోవా నుంచి బెంగళూరుకు తీసుకొచ్చేవాడని గుర్తించారు. ఈ ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి కారు, 35 లీటర్ల స్పిరిట్‌, రూ.17,400 నగదు, 11 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ మదనపల్లె ఎక్సైజ్‌ కార్యాలయంలో విచారించిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం తంబళ్లపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లి న్యాయాధికారి ఎదుట హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించడంతో నిందితులను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. కాగా, జినేశ్‌పై కేరళలో గతంలో స్పిరిట్‌ కేసులు నమోదైనట్లు ఎక్సైజ్‌ పోలీసుల విచారణలో తేలింది.


లారీ క్లీనర్‌ నుంచి నకిలీ లిక్కర్‌ వరకు

జినేశ్‌ రిమాండ్‌ రిపోర్టు ప్రకారం... 2018లో గోవా వెళ్లిన జినేశ్‌ లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. అక్కడ బాలాజీ(ఏ15)తో పరిచయమైంది. 2023లో బాలాజీ తన స్నేహితుడు అద్దేపల్లి జనార్దనరావు(ఏ1)తో కలిసి నకిలీ మద్యం తయారు చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. దీనికి స్పిరిట్‌ సరఫరా చేయాలని బాలాజీ కోరడంతో జినేశ్‌ అంగీకరించాడు. డిస్టిలరీల నుంచి లీటరు రూ.125 చొప్పున స్పిరిట్‌ను కొనుగోలు చేసి బాలాజీకి రూ.180కి అమ్మేవాడు. గోవా నుంచి శిబు తన వాహనంలో స్పిరిట్‌ తెచ్చి బెంగళూరు సమీపంలోని బసవరాజ్‌ ఎస్టేట్‌లో ఉన్న రూమ్‌లో నిల్వ చేసేవాడు. కాగా, జినేశ్‌, శిబులను అరెస్టు చేయడంతో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితుల సంఖ్య 25కు చేరింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందతులు ఎక్సైజ్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Updated Date - Nov 05 , 2025 | 06:06 AM