Extramarital Relationship: కుటుంబాన్ని వదిలేసి.. ఏపీకి వచ్చేసి
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:28 AM
గల్ఫ్ దేశాలకు వచ్చిన భారతీయులు కొందరు తప్పిపోవడం లేదా కుటుంబాలతో సంబంధాలు తెంపుకొని ఉండడం సహజం. కానీ అనూహ్యంగా గల్ఫ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయి...
అబుధాబిలో పశ్చిమగోదావరి యువతితో కేరళకు చెందిన షాహనద్‌కు పరిచయం
యువతితో వచ్చేసి.. అజ్ఞాతంగా కాపురం!
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
గల్ఫ్ దేశాలకు వచ్చిన భారతీయులు కొందరు తప్పిపోవడం లేదా కుటుంబాలతో సంబంధాలు తెంపుకొని ఉండడం సహజం. కానీ అనూహ్యంగా గల్ఫ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయి, ఓ యువతితో అజ్ఞాతంలో కలిసి ఉంటున్న తమ కుమారుడిని వెతికిపెట్టమని కేరళకు చెందిన బాధిత కుటుంబం కోరుతోంది. తన భర్త ఆచూకీ కోసం ముగ్గురు చిన్నారులతో భార్య ఎదురుచూస్తోంది. వివరాల ప్రకారం.. కేరళలోని మణప్పురం జిల్లాకు చెందిన పాలకుందన్ షాహనద్ అనే 30 ఏళ్ల యువకుడు యూఏఈలోని అబుధాబిలో పనిచేసేవాడు. ఆయనకు భార్య జంషీరా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. షాహనద్ పనిచేస్తున్న కంపెనీ సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన ఒక యువతి కూడా పని చేసేది. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు, ఆపై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలేసిన సదరు యువకుడు.. ఆ యువతి వెంట పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చి, అక్కడ అమెతో కాపురం చేస్తున్నట్లుగా కేరళలోని అతడి కుటుంబం ఆరోపిస్తుంది. సదరు యువతి మాయమాటలతో మభ్యపెట్టి షాహనద్‌తో చర్చిలో పెళ్లి కూడా చేసుకుందనే సమాచారం తమకు ఉన్నట్లుగా చెబుతోంది.