మడ అడవులపై కన్ను!
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:54 AM
నిన్నటి వరకు పెడన మండలంలో ఇష్టారాజ్యంగా మడ చెట్ల నరికివేత చేపట్టిన అక్రమార్కులు ఇప్పుడు రూటు మార్చారు. పది వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బంటుమిల్లి మండలంపై కన్నేశారు. యథేచ్ఛగా మడ చెట్లను నరికివేసి రాత్రికి రాత్రే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో మడ చెట్లను నరికేస్తుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాలకు సముద్రం నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.
- బంటుమిల్లి మండలంలో యథేచ్ఛగా మడ చెట్ల నరికివేత
- రాత్రికి రాత్రే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు!
- వందల ఎకరాల్లో పాగావేసిన అక్రమార్కులు
- నిన్నటి వరకు పెడనలో.. నేడు బంటుమిల్లిలో దందా!
- మామూళ్ల మత్తులో జోగుతున్న రెవెన్యూ అధికారులు
- జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
- గ్రామాలకు పొంచి ఉన్న సముద్ర ముప్పు
నిన్నటి వరకు పెడన మండలంలో ఇష్టారాజ్యంగా మడ చెట్ల నరికివేత చేపట్టిన అక్రమార్కులు ఇప్పుడు రూటు మార్చారు. పది వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బంటుమిల్లి మండలంపై కన్నేశారు. యథేచ్ఛగా మడ చెట్లను నరికివేసి రాత్రికి రాత్రే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో మడ చెట్లను నరికేస్తుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాలకు సముద్రం నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం):
బంటుమిల్లి మండలంలో సుమారుగా 10 వేల ఎకరాల విస్తీర్ణంలో మడ అడవి ఉంది. ఈ అడవి అంతా కూడా సముద్రానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తుఫాన్లు వచ్చిన సమయంలో మడ అడవి ప్రాంతం అత్యంత సమీపానికి సముద్రం నీరు వస్తుంది. దీంతో చాలా వరకు మడచెట్లు సముద్రపు ఉప్పునీటిలో ఉండేవి. మడచెట్ల నరికివేత లేని రోజుల్లో మడ అడవుల సమీపంలో ఉన్న పొలాల్లో బంగారం పండేది. నేల కూడా మంచి సారవంతంగా ఉండేది. పంట దిగుబడులు అత్యధికంగా ఉండేవి. ఇటువంటి పరిస్థితుల్లో అక్రమార్కుల కన్ను మడ అడవులపై పడింది. బంటుమిల్లి, మణిమేశ్వరం, నారాయణపురం, పాండ్రాక, రామాపురం, ఇంతేరులో భారీ స్థాయిలో మడచెట్లు నరికేస్తున్నారు. వందల ఎకరాలను రాత్రికి రాత్రే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. అక్రమార్కుల చెరలో చిక్కిన భూములకు అంతే వేగంగా పట్టాలు కూడా వచ్చేస్తున్నాయి. ఆ వెంటనే ఇతరులకు లీజులకు ఇచ్చేస్తున్నారు. జెట్ స్పీడ్‌తో క్రయ విక్రయాలు జరిగిపోతున్నాయి. అనేక మంది చేతులు మారిపోతున్నాయి. ఈ పాపంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం భాగస్వామ్యం ఉందని విమర్శలు ఉన్నాయి. ఆర్డీవో కార్యాలయంలో కూడా అక్రమార్కులకు సహకారం లభిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మడచెట్ల నరికివేత పతాకస్థాయికి చేరింది.
దెబ్బతిన్న పంట భూములు
మడచెట్ల నరికివేత ప్రారంభం కాగానే.. పంట పొలాలు కూడా కలుషితంగా మారిపోతున్నాయి. మడచెట్ల నరికివేత కారణంగా సముద్రం ఉప్పొంగినపుడు రొయ్యల చెరువులలోకి ఉప్పునీరు వస్తుంది. ఉప్పునీటిలో రొయ్యలు ఎక్కువుగా బతుకుతాయన్న ఉద్దేశ్యంతో.. సముద్రపు పాయలకు గాడి కొడుతూ ఆ నీటిని రొయ్యల చెరువులలోకి మళ్లిస్తుంటారు. ఒక్కోసారి ఆటుపోట్ల కారణంగా సముద్ర పాయల నుంచి పెద్ద ఎత్తున ఉప్పునీరు రొయ్యల చెరువులలోకి వచ్చి అవి పొంగిపొర్లి పంట చేల మీదకు ఎగదన్నుతున్నాయి. దీంతో పంట పొలాలు ఉప్పునీటి కారణంగా దెబ్బతింటున్నాయి. పంటలు సరిగా పండని పరిస్థితి ఏర్పడుతోంది. బంటుమిల్లి కేంద్రంగా జరుగుతున్న మడచెట్ల నరికివేతపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఆయా గ్రామాల ప్రజలు రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదులు చేస్తున్నా పట్టంచుకోవడంలేదు. జిల్లా యంత్రాంగానికి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మామూళ్ల మత్తులో రెవెన్యూశాఖ
బంటుమిల్లి మండల రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోందని విమర్శలు వస్తున్నాయి. స్థానికంగా కొందరు వీఆర్వోలు మడచెట్ల నరికివేత పుణ్యమా అంటూ బాగా స్థిరపడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలిచిన వీఆర్వోలు కొందరు ఖరీదైన ప్లాట్లను, ఫ్లాట్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయానికి కూడా అవినీతి పాకింది. ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే అక్కడ మడ చెట్లు లేవు కదా అని అధికారులు వాదించే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆర్డీవో కార్యాలయం ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉదంతం వెలుగుచూసింది.
పొంచి ఉన్న ప్రమాదం
ప్రతి వందేళ్లకు ఒకసారి సముద్రపు విపత్తులు సంభవిస్తున్న చరిత్ర బందరు ప్రాంతంలో ఉంది. వందేళ్ల కిందట సముద్రంలో సంభవించిన చమురు పేలుడు కారణంగా ఘంటసాల వరకు సముద్రం ఉప్పొంగింది. ఆ సందర్భంలో 30 వేల మందికి పైగా చనిపోయారు. వీరిలో అప్పటి బ్రిటీషు పాలకులతో పాటు మత్స్యకారులు ఉన్నారు. ఇలాంటి విపత్తులు భవిష్యత్తులో రావని చెప్పలేం.. సునామీలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. భారీగా సముద్రం ఆటుపోట్లకు గురైనా కూడా తీర ప్రాంతాలు అతలాకుతలం కావాల్సిందే ! ఇలాంటి సందర్భాలలో నష్టాన్ని కొంతమేర నియంత్రించలిగలిగేవి మడ అడవులే. సముద్ర ప్రవాహాన్ని తగ్గించడంలో మడ అడవులు ఎంతగానో దోహదపడతాయి. ఇప్పటికైనా మడ అడవుల సంరక్షణపై కలెక్టర్ బాలాజీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.