కష్టాల్లో కేసీ ఆయకట్టు రైతు
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:58 PM
కేసీ ఆయకట్టు రైతులు కష్టాల్లో పడ్డారు.

కాల్వలో తగ్గిన నీటి ప్రవాహం ఆందోళనలో వరి, నువ్వుల పంట రైతులు రాజోలి వద్ద నీటిమట్టం తగ్గిందంటున్న అధికారులు
దువ్వూరు, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): కేసీ ఆయకట్టు రైతులు కష్టాల్లో పడ్డారు. కాలువలో నీరు ప్రవహిస్తుండడంతో రైతులు విస్తృతంగా పంటల సాగుకు పూనుకున్నారు. వరి, నువ్వు, కర్భూజ పంటలను వేశారు. వరి సాగుకు నిరంతరం నీటి అవసరం ఉంటుందని తెలిసి రైతులు కొందరు పంట పెట్టారు. మరికొందరు అడపా దడపా వచ్చినా నువ్వు, కర్బూజ పంటలు పండించుకోవచ్చని సాగుకు ముందడుగు వేశారు. ఏదో విధంగా ఇప్పటి వరకు కాలువకు నీరు అందాయి. ఉన్నఫలంగా కాలువలో ప్రవాహం ఆగిపోయింది. దీంతో పంటలు పెట్టిన రైతుల్లో ఆందోళన నెలకొంది. పంట చేతికందాలంటే కనీసం 10 నుంచి 15 రోజులు సాగునీరు అందాల్సి ఉంది. ఉన్నఫలంగా నీరు ఆగిపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. మండలంలోని దువ్వూరు, ఏకోపల్లె , జిల్లేళ్ల, కానగూడూరు, ఇడమడక, నేలటూరు, అన్నపుశాసు్త్రలపల్లె, బుక్కాయపల్లె, ప్రాంతాల్లో పెట్టుబడులకు ఓర్చి పంటలు పెట్టారు. సాగునీరు ఆగిపోవడంతో అయోమయంలో పడ్డారు.
రాజోలి వద్ద నీటిమట్టం తగ్గింది
రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిలో నీటిమట్టం తగ్గింది. అందువలన నీటి సరఫరా నిలిచిపోనుంది. అక్కడ నీటి సరఫరా అవకాశం ఉంటే కేసీకి నీరు వదిలే అవకాశం ఉంది. రైతులను ఇంతకుమునుపే వరి పంట సాగు చేసుకోవద్దని చెప్పాం.
- పుల్లయ్య, కేసీకెనాల్ డీఈ, మైదుకూరు