Kaveri Travels Bus Accident: కే కావేరీ బస్సు బీభత్సం
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:39 AM
నెల రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన వీ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన మరువకముందే కే కావేరి ట్రావెల్స్ బస్సు అలజడి రేపింది...
ప్రమాదంలో 8 మందికి గాయాలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ఘటన
నందిగామ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నెల రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన వీ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన మరువకముందే కే కావేరి ట్రావెల్స్ బస్సు అలజడి రేపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి దాని ముందున్న లారీని బలంగా ఢీకొట్టిన బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగే సమయానికి 28 మంది బస్సులో ఉన్నారు. బస్సు ఎడమభాగం చివరి సీటు వరకు నుజ్జునుజ్జుగా మారింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడి లేచి భయంతో హాహాకారాలు చేశారు. వెంటనే బస్సు డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు వచ్చి ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోయిన లారీ, బస్సు ను క్రేన్ సాయంతో విడదీశారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశాకు చెందిన వారుగా గుర్తించారు. సవరం నరేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.