Excise Officials: గుట్టువిప్పిన కట్టా రాజు
ABN , Publish Date - Oct 10 , 2025 | 07:01 AM
రాష్ట్రంలో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు అనుచరుడు...
నకిలీ మద్యం నగదు ఎవరికి చేరిందో వాంగ్మూలం
తయారీ కేంద్రం మేనేజర్ అతనే
జనార్దన్‌రావు కోసం బెంగళూరు ఎయిర్‌పోర్టులో రెండు ప్రత్యేక బృందాలు
జయచంద్రా రెడ్డినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు
రాయచోటి/ములకలచెరువు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు అనుచరుడు, నకిలీ మద్యం తయారీ కేంద్రం మేనేజర్ కట్టా రాజు వాంగ్మూలంతో కేసు మలుపు తిరిగింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ తయారు చేసిన మద్యాన్ని జనార్దన్ రావు విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో విక్రయించినట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ కేసులో ఆయననే ఏ1గా చేర్చారు. మద్యం తయారీ కేంద్రం మేనేజర్ కట్టా రాజును పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం ద్వారా వచ్చిన నగదును ఎవరెవరి ఖాతాలకు ఎంత పంపారో కట్టా రాజు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు ఏ క్షణమైనా లొంగిపోతాడనే ప్రచారం జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు రెండు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఈ కేసులో నిందితుడు జయచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరుకు వెళ్లారు. ఆయన పీఏ రాజేశ్ కదలికలపైనా నిఘా పెట్టారు. వీరు విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
సీఐ హిమబిందురెడ్డి సస్పెన్షన్
ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందురెడ్డిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నకిలీ మద్యం తయారీ, విక్రయాల తతంగం ఆమెకు తెలిసే జరిగిందన్న ఆరోపణలు ఉండడంతో మూడు రోజుల క్రితం విజయవాడలోని ఎక్సైజ్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆమె పాత్రపై మరిన్ని ఆధారాలు లభించడంతో సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు.