ప్రేమ, సున్నితత్వ భావాల మేళవింపే కాశీభట్ల రచనలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:56 PM
ప్రఖ్యాత రచయిత కాశీభట్ల వేణుగోపాల్ రచనలు ప్రేమ, సున్నితత్వ భావాల మేళవింపుతో నిండి ఉంటాయని ప్రముఖ సాహితీ విమర్శకుడు వంశీకృష్ణ అన్నారు.
సాహితీ విమర్శకుడు వంశీకృష్ణ
కర్నూలు కల్చరల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత రచయిత కాశీభట్ల వేణుగోపాల్ రచనలు ప్రేమ, సున్నితత్వ భావాల మేళవింపుతో నిండి ఉంటాయని ప్రముఖ సాహితీ విమర్శకుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం నగరంలోని మద్దూర్‌నగర్‌లోని పింగళి సూరన తెలుగుతోట సమావేశ హాలు లో, అక్షరం లిటరరీ ట్రస్టు సంస్థ ఆధ్వర్యంలో కాశీభట్ల సంస్మరణ సభ, అక్షరం లిటరరీ పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాశీభట్ల స్మరణ సంచిక ‘నిహితమ్’ను ఆవిష్కరించారు. అక్షరం ట్రస్టుసంస్థ కార్యదర్శి జి. వెంకటకృష్ణ సభాధ్యక్షతన కార్యక్రమం జరిగింది. వంశీకృష్ణ మాట్లాడుతూ కాశీభట్ల తుపాను అంటి కవి అని, తన రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని గుర్తు చేశారు. శిల్పం తో విన్యాసం చేశారని, అయితే వస్తువు, శిల్పంతో సమన్వితం చేశారని కొనియడారు. కవిగా ఆయన ఎవరి ప్రభావంతోనూ కొట్టుకుపోలేదని, సమాజాన్ని- వ్యక్తిని, వ్యక్తిని-వ్యక్తిత్వాన్ని సమన్వయం చేస్తూ వాటిని చక్కగా స్కానింగ్ చేయగలిగిన కవి అని శ్లాఘించారు. కృత్రిమ అలంకారాలు తొడగని కవిగా, సహజసిద్ధ కవిగా ఆయన రచనలు చేశారని, ఆయన రచనలు అంత త్వరగా అర్థంకావని, అయితే ఆరచనలన్నీ జాజుల పరిమళాల వంటివని చెప్పారు. ఈ సభలో ట్రస్టు సభ్యులు అవిజ వెంకటేశ్వరరెడ్డి, కథా రచయితలు ఎస్‌ఎండీ ఇనాయతుల్లా, పౌరోహితం మారుతి, డాక్టర్ ఎం. హరికిషన, డాక్టర్ నాగేశ్వరాచారి, ఎస్‌డీవీ అజీజ్, కల్యాణదుర్గం స్వర్ణలత, ఎలమర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
కవి తెలుగు వెంకటేశకు కాశీభట్ల పురస్కారం ప్రదానం..
ఈ సభలో అతిథులు, ఆహ్వానితులు, కవులు సంయుక్తంగా కర్నూలుకు చెందిన కవి తెలుగు వెంకటేశకు కాశీభట్ల పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. అక్షరం లిటరరీ ట్రస్టు సంస్థ కాశీభట్ల వేణుగోపాల్ పేరుతో ఇచ్చే పురస్కారాన్ని ఈఏడాదికి తెలుగు వెంకటేశకు అందజేయడంతో పాటూ రూ.25వేలు నగదు, జ్ఞాపిక, శాలువాలతో సన్మానించారు.