కార్తీక శోభ
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:39 PM
జిల్లా వ్యాప్తంగా ఆలయాల వద్ద కార్తీక శోభ సంతరించుకుంది.
మహానందికి పోటెత్తిన భక్తులు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు
కోనేర్లలో పుణ్యస్నానాలు
జిల్లా వ్యాప్తంగా ఆలయాల వద్ద కార్తీక శోభ సంతరించుకుంది. ఆదివారం మహానంది శైవక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే ఆలయం ప్రాంగణంలోని కోనేర్లల్లో పుణ్య స్నానాలను ఆచరించారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే దర్శనం ఏర్పాటు చేయించారు. మహిళలు నాగులకట్ట, ద్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. కార్తీక చివరి సోమవారం క్షేత్రంలో మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. నంద్యాల పట్టణంలోని పలు శివాలయాలను భక్తులు దర్శించుకున్నారు. ప్రథమనంది, నాగనంది, సోమనంది, బ్రహ్మన ందీశ్వరాలయం, సంజీవనగర్‌రామాలయం, నాగులకుంటరోడ్డులోని నాగలింగేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉసిరి చెట్టుకింద దీపాలు వెలిగించి పూజలు చేశారు. బండిఆత్మకూరు మండలంలోని ఓంకారంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లపాపలతో ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. ముందుగా పంచబుగ్గల కోనేటిలో స్నానం ఆచరించి గంగా, ఉమా సమేత సిద్దేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. వృక్షంలో కొలువుదీరిన అభయాంజనేయుడికి ప్రదక్షిణలు చేశారు. ఎత్తైన కొండల్లో వెలసిన పద్మావతి సహిత శ్రీనివాస ఆలయాన్ని దర్శించుకున్నారు. భక్తులకు కాశిరెడ్డినాయన ఆశ్రమ సేవకులు అన్నదానం చేశారు. గడివేముల మండలంలోని దుర్గాభోగేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దుర్గాభోగేశ్వరుడికి, బాలత్రిపురాంబసమేత పాలకేశ్వరస్వామికి పూజలు చేశారు.
· ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్