Karthika masam: శ్రీగిరికి కార్తీక శోభ..
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:50 AM
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన ఏకైక క్షేత్రం శ్రీశైలంలో బుధవారం నుంచి కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి...
నంద్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన ఏకైక క్షేత్రం శ్రీశైలంలో బుధవారం నుంచి కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబరు 21వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. కిలోమీటర్ల పొడవున బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మల్లన్నకు మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా కార్తీకమాసంలో సాధారణ భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు పలు మార్పులు చేశారు. రూ.5వేల గర్భాలయ అభిషేకం టికెట్లు, రూ.1500 సామూహిక అభిషేకం టికెట్లను రద్దు చేసినట్టు ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. రోజూ విడతల వారీగా మల్లికార్జున స్వామి స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. శని,ఆది సోమవారాల్లో అంతరాలయంలో అమ్మవారికి జరిగే కుంకుమార్చనలను నిలిపివేసి, వేదాశ్వీరచన మండపంలో నిర్వహిస్తామని తెలిపారు.