Kumki elephants: కుంకీలు వచ్చేశాయ్
ABN , Publish Date - May 22 , 2025 | 04:34 AM
ఏపీ అడవుల్లో ఏనుగుల నియంత్రణ కోసం కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించింది. పవన్ కల్యాణ్ ‘మన ఊరికోసం మాటామంతీ’ పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
దేవా, కృష్ణ, అభిమన్యు, రంజన్ రాక
ఏనుగులను అందజేసిన కర్ణాటక
పూలు చల్లి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
బెంగళూరు, అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): ఏపీకి కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. రాష్ట్రంలో ఏనుగుల గుంపులను తరిమికొట్టేందుకు ఆరు కుంకీ ఏనుగులను ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ ఇటీవల కోరడంతో ఆయన సమక్షంలోనే రాష్ట్ర అటవీశాఖ అధికారులకు కుంకీ ఏనుగులను కర్ణాటక బుధవారం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శిక్షణ పూర్తికాకపోవడం, ఏనుగుల ఆరోగ్య కారణాల రీత్యా మిగిలిన రెండింటిని ఇప్పుడు ఇవ్వలేకపోతున్నట్లు కర్ణాటక అటవీశాఖ తెలిపింది. ఏనుగుల అప్పగింతకు సంబంధించిన విధివిధానాలు, ఒప్పంద పత్రాలు, లైసెన్సులను పవన్‌కల్యాణ్‌కు సిద్ధరామయ్య అందజేశారు. ఈ సందర్భంగా గజ పూజ నిర్వహించారు. అనంతరం కర్ణాటక అధికారులు జెండా ఊపి కుంకీ ఏనుగులను సాగనంపగా, పవన్ పూలుజల్లుతూ స్వాగతం పలికారు. కుంకీ ఏనుగులు కృష్ణ(15 ఏళ్లు) అభిమన్యు(14), దేవా(39), రంజన్(26)ను కర్ణాటక అటవీ అధికారుల నుంచి ఏపీ అధికారులు స్వీకరించారు. కర్ణాటక మావటీలు 2నెలల పాటు కుంకీ ఏనుగులతోపాటు ఉండి, ఏపీ మావటీలకు శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలో మరో 2ఏనుగులు ఇస్తామని ఈ సందర్భంగా సిద్దరామయ్య చెప్పారు. ఏపీ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులను ఇవ్వడానికీ ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

కుంకీ ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. కన్నడ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను సిద్దరామయ్య, కర్ణాటక మంత్రులు ఘనంగా సత్కరించారు.
తుంగభద్ర జలాలపై చర్చించాలి: డీకే
తుంగభద్ర నదీజలాల్లో కర్ణాటక వాటాను సద్వినియోగం చేసుకునే విషయమై చర్చలు జరిపేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వాలని కర్ణాటక డీసీఎం, జలవనరుల మంత్రి డీకే శివకుమార్ కోరారు. కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తుంగభద్ర జలాల అంశంపై చర్చించేందుకు పవన్‌కల్యాణ్ చొరవ చూపాలని కోరారు. ‘మీరే ముందుండి సమావేశాన్ని ఏర్పాటు చేయించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
నేడు రావివలస ప్రజలతో పవన్ మాటామంతీ..!
టెక్కలి, శ్రీకాకుళం, మే 21(ఆంధ్రజ్యోతి): ప్రజలతో మమేకమై వారి సమస్యలు ఆలకించి.. వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టిన స్ర్కీన్ గ్రీవెన్స్ కార్యక్రమం ‘‘మన ఊరికోసం మాటామంతీ’’కి సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస ప్రజలతో పవన్ గురువారం ఉదయం 8.30 నుంచి 10.35 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. వెండితెర వేదికగా వర్చువల్ పద్ధతిలో జరిగే కార్యక్రమం కోసం టెక్కలిలోని భవానీ థియేటర్‌ను ఎంపిక చేశారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి