Karnataka Govt: 64.75 టీఎంసీలివ్వాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:35 AM
ఏపీ ప్రభుత్వం రాయలసీమకు గేమ్ చేంజర్‌గా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక ప్రభుత్వం కొత్త వివాదాన్ని లేవనెత్తింది.
పోలవరం-బనకచర్ల అనుసంధానిస్తే కృష్ణా వాటాలో ఆ మేరకు కేటాయించాలి
ఇప్పటికే పట్టిసీమ నుంచి 80 టీఎంసీలు ఏపీ ప్రభుత్వం కృష్ణాలోకి ఎత్తిపోస్తోంది
కొత్త పేచీ లేవనెత్తిన కర్ణాటక సర్కారు
కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శికి లేఖ
కృష్ణా బేసిన్ కాదు, వాటా ఇవ్వక్కర్లేదు: ఏపీ
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం రాయలసీమకు గేమ్ చేంజర్‌గా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక ప్రభుత్వం కొత్త వివాదాన్ని లేవనెత్తింది. ఈ పథకం అమలైతే.. కృష్ణాజలాల్లో తమకు 64.75 టీఎంసీలు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తూ కర్ణాటక అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శికి ఈ నెల 17న లేఖ రాశారు. పట్టిసీమ ద్వారా ఇప్పటికే తమకు అన్యాయం జరుగుతోందన్నారు.
లేఖలో ఏముంది?
‘‘ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పట్టిసీమ నుంచి 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదిలోకి ఎత్తిపోస్తోంది. గోదావరి ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీల వాటా దక్కాలి. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి సంబంధించిన ‘ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టు’ని గత ఏడాది నవంబరు 11న కేంద్ర జలశక్తి మాకు పంపింది. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంతో 243 టీఎంసీలను తరలించే అవకాశం ఉంది. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం ద్వారా 243 టీఎంసీలు.. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు తరలిస్తున్నందున.. మాకు 64.75 టీఎంసీల మేరకు కృష్ణా జలాల్లో వాటా ఇవ్వాల్సిందే.’’ అని లేఖలో పేర్కొన్నారు.
ఏపీ వాదన ఇదీ..
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం పరిధిలోకి రాదని.. అందువల్ల గోదావరి ట్రైబ్యునల్ ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. కర్ణాటక వాదనలో పసలేదన్నారు. వాస్తవానికి.. నాగార్జున సాగర్‌కు ముందు అక్విడెక్టును కట్టి, కృష్ణానదిలోకి గోదావరి జలాలను కలువకుండానే.. బనకచర్లవైపు మళ్లిద్దామని అనుకున్నామన్నారు. అయితే, అక్విడెక్టు నిర్మాణానికి దాదాపు రూ.1000 కోట్ల మేర వ్యయం అవుతున్నందున.. కృష్ణా నదిలోకి గోదావరి జలాలను ఎత్తిపోసి.. వాటిని వెంటనే తోడేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఫలితంగా కృష్ణాజలాల వాడకం అనే వాదనకే అర్థం ఉండదన్నారు.