Kapass Kisan: పత్తి కొనుగోలుకు కప్సాస్ కిసాన్ యాప్
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:27 AM
ఈ ఏడాది పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కొత్త మార్గదర్శకాలు తెచ్చింది...
వివరాల నమోదు, స్లాట్ బుకింగ్ తప్పనిసరి
సీసీఐ కొత్త నిబంధనలపై రైతులు, జిన్నర్స్ అభ్యంతరాలు
సడలింపులివ్వాలన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
11న ఆల్ ఇండియా జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్‌తో కాన్ఫరెన్స్
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. ‘కప్సాస్ కిసాన్’ అనే యాప్‌లో రైతుల వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు స్లాట్ బుకింగ్‌ను తప్పనిసరి చేసింది. అలాగే మండలాల మ్యాపింగ్, షెడ్యూలింగ్, ఎల్1, 2, 3 ప్రమాణాల ఆధారంగా జిన్నింగ్ మిల్లులు తెరవడం వంటి కొత్త విధానాలను సీసీఐ ప్రవేశ పెట్టింది. అయితే ఈ నిబంధనల కారణంగా రైతులు తమ పత్తిని సమీపంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకోలేని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రైతులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్లాట్ బుకింగ్ ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ సూచిస్తే అక్కడి సీసీఐ కేంద్రానికి రైతులు పత్తిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇది శ్రమతో కూడుకున్నదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్.. సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీతతో పాటు జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో 2025-26లో పత్తి కొనుగోలుపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది నుంచి సీసీఐ అమలు చేయనున్న ‘కప్సాస్ కిసాన్’ యాప్, జిన్నింగ్ మిల్లుల సంఘం లేవనెత్తిన వివిధ అంశాలపై రాజశేఖర్ సమీక్ష చేశారు. జిన్నింగ్ మిల్లుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు జిన్నర్స్ అసోసియేషన్ అంగీకరించడం లేదని సీసీఐ అధికారులు వివరించారు. అయితే సీసీఐ కొత్త నిబంధనలపై జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు అభ్యంతరం చేస్తూ, సీసీ కెమెరాల విషయంలో కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుని, సీసీఐ నడలింపులు ఇవ్వాలని కోరారు. అందరి వాదనలు విన్నాక.. రైతుల శ్రేయస్సు దృష్ట్యా పత్తి కొనుగోలును వేగవంతం చేయాల్సి ఉన్నందున అవకాశం మేరకు సీసీఐ సడలింపులు ఇవ్వాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. దీనిపై ఈ నెల 11న ఆల్ ఇండియా జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, చర్చల అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా చెప్పారు.