Kanakameddla Ravindra Kumar: అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:10 AM
సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎ్‌సజీ)గా సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత కనకమేడల...
మూడేళ్లపాటు పదవిలో.. కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎ్‌సజీ)గా సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. ఆయనతోపాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు దవీందర్ పాల్‌సింగ్, అనిల్ కౌశిక్‌లకు కూడా ఏఎ్‌సజీలుగా అవకాశం లభించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ మూడేళ్లపాటు ఏఎ్‌సజీలుగా కొనసాగుతారని పేర్కొంది. ప్రస్తుతం.. భారత అటార్నీ జనరల్‌గా వెంకట రమణి, సోలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నత బాధ్యత అదనపు సొలిసిటర్ జనరల్‌దే కావడం విశేషం.
సివిల్ కోర్టు న్యాయవాది నుంచి..
కనకమేడల రవీంద్రకుమార్ 8, ఆగస్టు 1956న జన్మించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎంఎల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1983లో ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. విజయవాడలో సీనియర్ న్యాయవాది కాటమనేని రవీంద్రరావు దగ్గర జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు విజయవాడ సివిలో కోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1994లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఈ క్రమంలోనే.. కేంద్ర ప్రభుత్వం, ఏపీఎ్‌సఆర్టీసీ, ఏపీ ఎలక్ర్టిసిటీ బోర్డు, ఏపీ ట్రాన్స్‌కో సహా పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. ప్రస్తుతం.. సుప్రీంకోర్టుతోపాటు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లోనూ సీనియర్ న్యాయవాదిగా రవీంద్ర కుమార్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ కమిటీలో..
కనకమేడల రవీంద్రకుమార్ 2018-24 వరకు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన రాజ్యసభ ప్యానల్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే, ఆ ఆరేళ్ల కాలంలో అనేక పార్లమెంటరీ స్థాయీ సంఘాలు, కమిటీల్లో సభ్యుడిగా చేశారు. ప్రధానంగా ‘లా అండ్ జస్టిస్’ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యా యం(పీపీజీ-లా) తదితర కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.