Pilgrimage Crowd: కావుమా కనకదుర్గమ్మా... భక్తజనకీలాద్రి
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:15 AM
ఇంద్రకీలాద్రి భక్తజనకీలాద్రిగా మారిపోయింది. దసరా ఉత్సవాలలో సోమవారం కనకదుర్గమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారాన్ని దర్శించుకోవటానికి...
సరస్వతీ దేవి అలంకారంలో అమ్మను చూడాలని..రాష్ట్రాలు దాటి తరలివచ్చిన భక్తగణం
ఉత్తరాంధ్ర నుంచి భారీగా..
సోమవారం అర్ధరాత్రి సమయానికి 2 లక్షలకు పైగా భక్తులకు దర్శనం
విజయవాడ, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రి భక్తజనకీలాద్రిగా మారిపోయింది. దసరా ఉత్సవాలలో సోమవారం కనకదుర్గమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారాన్ని దర్శించుకోవటానికి అశేష భక్తజనవాహిని తరలి వచ్చింది. రాష్ట్ర నలు చెరగుల నుంచే కాకుండా, పొరుగు రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఏపీ నుంచి కనకదుర్గమ్మను అమితంగా పూజిం చే ఉత్తరాంధ్ర నుంచి అశేషంగా తరలి వచ్చారు. రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలు అన్నీ కిటకిటలాడుతూ బెజవాడ బయలుదేరాయి. రాత్రి 10 గంటల సమయానికి కనకదుర్గమ్మను దర్శించుకోవటానికి వచ్చిన భక్తుల సంఖ్య రెండు లక్షలు దాటిపోయింది. ఆ సమయానికి ఇంద్రకీలాద్రి నుంచి దిగువ కెనాల్ రోడ్డు మీదుగా వినాయకుడి గుడి వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల మేర అమ్మను దర్శించుకోవటానికి క్యూలలో ఉన్నారు. సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఎలాగైనా దర్శించుకోవాలన్న భావనతో ఎన్ని గంటలు పడుతుందన్న అంశాన్ని కూడా లెక్కచేయకుండా ఆదివారం అర్థరాత్రి 12 గంటల నుంచే వచ్చి క్యూలో నిలబడ్డారు. అర్ధరాత్రి ఒంటి గంటకు సరస్వతి అలంకారం మొదలవగా దర్శనానికి అనుమతించారు. అప్పటి నుంచి సోమవారం రాత్రి 11 గంటల వరకు క్యూలు భక్తులతో పోటెత్తాయి. దర్శనానికి వదిలినప్పటికీ రద్దీతో క్యూలన్నీ నెమ్మదిగా సాగాయి. దీంతో అమ్మవారి దర్శనానికి సుమారు 7 నుంచి 9 గంటల సమయం పట్టింది.
రద్దీ ఇలా.. సోమవారం ఉదయం 4 గంటలకే 26 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి 9 గంటల సమయానికి లక్షా యాభైవేల మంది భక్తులు దర్శించుకున్నారు. పది గంటలకు ఈ సంఖ్య 2 లక్షలు దాటింది. దర్శనం పూర్తయ్యే సమయానికి భక్తుల సంఖ్య 2.5 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
‘అమ్మ జన్మనక్షత్రం రోజున ఎలాగైనా దర్శించుకోవాలి...’అనే భక్తి భావనతో రాష్ట్రాలు దాటి భక్తులు తరలి వచ్చారు. నిద్రాహారాలు లేకపోతేనేమి ఆ తల్లి కరుణ ఉంటే చాలు అంటూ ముందురోజు నుంచే పడిగాపులు కాశారు. ఇంద్రకీలాద్రిపై ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు పరిస్థితి ఇదీ.