Share News

Nellore: గంజాయి డాన్‌ కామాక్షి అరెస్ట్‌

ABN , Publish Date - Dec 01 , 2025 | 06:08 AM

నెల్లూరు జిల్లాలో గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి డాన్‌ అరవ కామాక్షిని అరెస్ట్‌ చేశారు.

Nellore: గంజాయి డాన్‌ కామాక్షి అరెస్ట్‌

  • 25 కేజీల గంజాయి, పత్రాలు.. బ్యాంకు పాస్‌బుక్‌లు స్వాధీనం

  • పెంచలయ్య హత్య కేసులో ఏడుగురు నిందితులు కూడా

  • మరో ఐదుగురి కోసం గాలింపు

నెల్లూరు(క్రైం)/నెల్లూరు (రూరల్‌), నవంబరు 30(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి డాన్‌ అరవ కామాక్షిని అరెస్ట్‌ చేశారు. నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంట్లో అక్రమ రవాణా కోసం దాచిన 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని విలువైన పత్రాలు, బ్యాంకు పాస్‌బుక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నెల్లూరు నగర ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఎం.గిరిధర్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో కల్లూరుపల్లి వద్ద జరిగిన పెంచలయ్య హత్య కేసులో కామాక్షి ప్రధాన నిందితురాలు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆమె కోసం గాలింపు చేపట్టారు. శనివారం రాత్రి నవాబుపేట స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వేణు ప్రత్యేక బృందంగా ఏర్పడి నవాబుపేట పరిధిలోని కిన్నెర ప్రసాద్‌ లేఅవుట్‌లో ఉన్న కామాక్షి ఇంటి వద్ద కాపు కాశారు. ఆ సమయంలో కామాక్షి ఇంటికి రావడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇంటి తాళాలు ఇవ్వాలని అడిగారు. ఆమె తాళాలు లేవని చెప్పడంతో తహసీల్దారు సమక్షంలో ఇంటి తాళాలను పగులగొట్టి తనిఖీలు చేశారు. ఇంట్లో దాచిన గంజాయి, విలువైన పత్రాలు, బ్యాంకు పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకొని, కామాక్షిని స్టేషన్‌కు తరలించారు. ఆదివారం గంజాయి కేసులో కామాక్షి అరెస్టు చూపించారు. త్వరలో నెల్లూరు రూరల్‌ పోలీసులు ఆమెను పీటీ వారెంట్‌పై పెంచలయ్య హత్య కేసులో అరెస్టు చూపించనున్నారు.


గంజాయి బ్యాచ్‌ అదుపులోకి

సీపీఎం నాయకుడు పెంచలయ్యను కిరాతకంగా హత్య చేసిన గంజాయి బ్యాచ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అరవ కామాక్షి తన అనుచరులతో కలసి ఆయన్ను దారుణంగా చంపింది. ఆ తర్వాత నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తితో దాడి చేయడంతో ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. అరవ కామాక్షి అనుచరులు ఏడుగురిని నెల్లూరు రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. పోలీసు కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు జేమ్స్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిశ్చార్జి అయ్యాక అతడి అరెస్టు చూపించనున్నారు. గంజాయి బ్యాచ్‌ చేతిలో గాయపడ్డ పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ ఆదినారాయణ కోలుకుంటున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 06:10 AM