Share News

కష్టకాలంలో ఆదుకున్న ‘కామధేను’

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:52 AM

వీరవల్లిలో కృష్ణామిల్క్‌ యూనియన్‌ ఆఽధ్వర్యంలో స్థాపించిన కామధేను యూనిట్‌ బుడమేరు వరద ముంపు సమయంలో ఆదుకుందని విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు.

కష్టకాలంలో ఆదుకున్న ‘కామధేను’

హనుమాన్‌జంక్షన్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): వీరవల్లిలో కృష్ణామిల్క్‌ యూనియన్‌ ఆఽధ్వర్యంలో స్థాపించిన కామధేను యూనిట్‌ బుడమేరు వరద ముంపు సమయంలో ఆదుకుందని విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. వీరవల్లి యూనిట్‌ లేకపోతే 2024లో అకస్మాత్తుగా సంభవించిన వరద ముంపుతో కృష్ణామిల్క్‌ యూనియన్‌ తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడే పరిస్థితి ఎదురయ్యేదన్నారు. ఈ యూనిట్‌లో నిర్మించిన దాసాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 16న నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చలసాని సతీసమేతంగా వీరవల్లి తిరుపతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆలయం ఎదుట ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు.అనంతరం జంక్షన్‌లోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి స్వామి ముంగిట ఆహ్వానపత్రిక పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2023లో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్యాక్టరీ ఆవరణలో సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆలయానికి భూమి పూజ నిర్వహించామన్నారు. ఆలయం నిర్మాణం శరవేగంగా పూర్తవడంతో 16న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం త్రిదండి చినజీయర్‌ స్వామి చేతులు మీదుగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించామన్నారు. ఆదివారం నుంచి 15 వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ప్రతిష్ఠ సందర్భంగా 15వేల మందికి అన్నసంతర్పణ చేయనున్నట్టు తెలిపారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా నలుమూలల నుంచి పాడి రైతు కుటుంబాలు, సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొని జీయర్‌ స్వామి ఆశీస్సులు అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 14 , 2025 | 12:52 AM