Share News

Hair Transplant Scam: జుట్టు మొలిపిస్తామని.. ముంచేశారు

ABN , Publish Date - Aug 08 , 2025 | 05:22 AM

మీ తలపై జుట్టు లేదా.. అయితే మా దగ్గరకు రండి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసి జుట్టు మొలిపిస్తాం.. అంటూ ఓ సంస్థ ప్రకటన చూసి మోసపోయాడో వ్యక్తి..

Hair Transplant Scam: జుట్టు మొలిపిస్తామని.. ముంచేశారు

  • కాకినాడలో ఓ సంస్థ మోసంపై పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

  • రూ.90 వేలు కట్టించుకోవడంతో పాటు టెస్టులతో తొమ్మిది నెలలుగా తాత్సారం

  • ఉన్న జుట్టు కూడా కట్‌ చేయించిన వైనం

కాకినాడ క్రైం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ‘మీ తలపై జుట్టు లేదా.. అయితే మా దగ్గరకు రండి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసి జుట్టు మొలిపిస్తాం..’ అంటూ ఓ సంస్థ ప్రకటన చూసి మోసపోయాడో వ్యక్తి! ఈ ఘటనకు సంబంధించి కాకినాడ టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. వివరాలిలా వున్నాయి... తలపై జుట్టులేని చోట ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో జుట్టు రప్పిస్తామనే ఒక ప్రకటనను చూసిన కాకినాడకు చెందిన కె.సురేష్‌.. నగరంలోని శ్రీనగర్‌ సీతాపతి స్వప్నసౌధ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వీఆర్‌ఎస్‌ హెయిర్‌ క్రియేషన్స్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ నిర్వాహకులు తమవద్ద 9 నెలల ట్రీట్‌మెంట్‌ ఉంటుందని, రూ.98వేల ప్యాకేజీతో తలపై మెండుగా జుట్టు రప్పిస్తామని చెప్పారు. సురేష్‌ దగ్గర రూ.10వేలతో పాటు వారే రూ.80వేలు ప్రైవేటు ఫైనాన్స్‌ చేయించి సంస్థకు జమ చేయించారు. సుమారు 9నెలల నుంచి ట్రీట్‌మెంట్‌ చేస్తామని చెప్పి, టెస్టులు చేయించుకుని రమ్మంటూ కాలయాపన చేశారని బాధితుడు పేర్కొన్నారు. వెళ్లిన ప్రతిసారీ టెస్టులకు రూ.3వేల నుంచి రూ.4వేల ఖర్చయ్యేదని తెలిపారు. ఈ నెల 5న ట్రీట్‌మెంట్‌ చేస్తామని చెప్పి.. తలపై ఉన్న మొత్తం జుట్టును ఒడిసా నుంచి తీసుకొచ్చిన బార్బర్లతో తీయించాడని వాపోయాడు. ఇంటి నుంచి బయటకు రావడానికి మానసిక క్షోభ అనుభవిస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. ట్రీట్‌మెంట్‌ చేయకుండా షుగరు, బీపీ ఉందని తాత్సారం చేస్తుండడంతో గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించానన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 05:24 AM