Nellore: కాకాణి బెయిలు షరతు సడలింపు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:38 AM
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిలు మంజూరు చేస్తూ విధించిన ఓ షరతును హైకోర్టు సడలించింది.
నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించడానికి హైకోర్టు అనుమతి
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిలు మంజూరు చేస్తూ విధించిన ఓ షరతును హైకోర్టు సడలించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ విధించిన షరతులను సవరించాలని కోరుతూ వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. కాకాణి తరఫు సీనియర్ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘కేసు దర్యాప్తు ముగిసి, చార్జ్‌షీట్ దాఖలు చేసేవరకు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించడానికి వీల్లేదని షరతు పెట్టారు. అలాగే దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసేవరకు ప్రతి ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని మరో షరతు విధించారు. రెండూ షరతులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. మరో వైపు పిటిషనర్‌పై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో బెయిల్ మంజూరు చేస్తూ కోర్టులు షరతులు విధించాయి. ఆ కేసులలో కూడా దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రవేశించకూడదన్న షరతు కారణంగా దర్యాప్తు అధికారి ముందు హాజరుకాలేని పరిస్థితి ఉంది. కోర్టు విధించిన షరతును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఓ కేసులో గూడూరు కోర్టు మూడు నెలలు లేదా చార్జ్‌షీట్ దాఖలు వరకు తమ పరిధిదాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. మరో 5 కేసుల్లో బీఎన్‌ఎస్‌ఎస్ 35(3)కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. దర్యాప్తు అధికారులు కోరినప్పుడు వారి ముందు హాజరుకావాల్సి ఉంది’ అని వివరించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కేసు దర్యాప్తు ముగిసి, చార్జ్‌షీట్ దాఖలు చేసేవరకు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించడానికి వీల్లేదని విధించిన షరతు సడలిస్తూ జిల్లాలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.