Visakhapatnam: కైలాసగిరికి మరో ఆకర్షణ
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:23 AM
విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మరిన్ని హంగులు సమకూరుస్తోంది.
55 అడుగుల ఎత్తైన త్రిశూలం ఏర్పాటుకు శంకుస్థాపన
బీచ్ రోడ్డులో హెలికాప్టర్ మ్యూజియం ప్రారంభం
విశాఖపట్నం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మరిన్ని హంగులు సమకూరుస్తోంది. ఇక్కడ 55 అడుగుల ఎత్తైన త్రిశూలం నిర్మాణానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ‘ఈ త్రిశూలం హనుమంతవాక వైపు ఉంటుంది. చీకటి పడ్డాక వెలుగులు విరజిమ్ముతుంది. ఢమురకం కూడా ఉంటుంది. రూ.1.55 కోట్లు వెచ్చిస్తున్నాం’ అని వివరించారు. ఆ తరువాత బీచ్ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన యూహెచ్-3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియాన్ని మంత్రులు డోలా, వంగలపూడి కలసి ప్రారంభించారు. దీనికి రూ.3.5 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే బీచ్ రోడ్డులో కురుసుర సబ్‌మెరైన్, టీయూ-142, సీ హ్యారియర్ యుద్ధ విమానాల మ్యూజియాలు ఉండగా వాటి సరసన కొత్తగా యుహెచ్-3 హెచ్ చేరింది. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.